నదీజలాలు, చెరువులు కలుషితం కాకుండా మహానగరంలో ఉత్పత్తయ్యే మురుగునీటిని వందశాతం శుద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.3,866.21 కోట్ల వ్యయంతో 31 నూతన సీవరేజి ట్రీట్మెంట్ ప్లాంట్ల (ఎస్టీపీ)ను నిర్మిస్తున్నది. ప్రస్తుతం 40 శాతం మురుగు శుద్ధి అవుతుండగా, నూతన ఎస్టీపీల ద్వారా నిత్యం 1950 ఎంఎల్డీల నీటిని 100 శాతం శుద్ధి చేయాలన్న సంకల్పంతో పనులను వేగంగా నిర్వహిస్తున్నది. మూడు ప్యాకేజీలుగా పనులు విభజించారు. ప్యాకేజీ-1,3 పనులు చురుగ్గా సాగుతుండగా, రెండో ప్యాకేజీ పనులు చివరిదశకు చేరుకుంటుండడంతో ఈ ప్యాకేజీలోని నాలుగు ఎస్టీపీలు దసరా నాటికి అందుబాటులోకి రానున్నాయి. మార్చి కల్లా వందశాతం పనులు పూర్తి చేసేందుకు జలమండలి కృతనిశ్చయంతో ఉంది. దేశంలోని 8 మెట్రో నగరాల్లో ఎక్కడా లేనివిధంగా నగరంలో అధికసంఖ్యలో ఎస్టీపీలు నిర్మిస్తుండడం గర్వకారణం.
సిటీబ్యూరో, సెప్టెంబర్ 4: (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహానగరంలో వెలువడే మురుగు నీటిని వందశాతం శుద్ధి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రూ.3,866.21 కోట్లతో 31 కొత్త సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ల(ఎస్టీపీ)ను నిర్మిస్తున్నది. దేశంలో ఎనిమిది ముఖ్య నగరాల్లో ఎక్కడా లేని విధంగా మన హైదరాబాద్‌లో 40 శాతం మురుగును ప్రతి రోజు శుద్ధి చేస్తున్నామని, నూతన ఎస్టీపీల నిర్మాణం ద్వారా ప్రతి రోజూ 1950 ఎంఎల్డీ (మిలియన్ లీటర్ ఫర్ డే) మురుగునీటిని 100శాతం శుద్ధి చేయవచ్చన్న అంచనాతో జలమండలి ఆధ్వర్యంలో పనులను నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగానే మూడు ప్యాకేజీల వారీగా పనులను విభజించి పనులు నిర్వహిస్తుండగా ప్యాకేజీ-2 పనులు తుది దశకు చేరాయి. దసరా నాటికల్లా ఈ ప్యాకేజీలోని నాలుగు ఎస్టీపీలను అందుబాటులోకి తీసుకువచ్చి 480.50 ఎంఎల్డీల మేర అదనంగా మురుగును శుద్ధి చేసి మూసీలోకి వదలనున్నారు. ఇక ప్యాకేజీ-1, 3 పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. అయితే కొన్ని చోట్ల పనులు పట్టాలెక్కాల్సి ఉందని, న్యాయపరమైన చిక్కులను త్వరలోనే అధిగమించి పనులు చేపడతామని అధికారులు తెలిపారు. దసరా తర్వాత విడుతల వారీగా ఎస్టీపీలను అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు. ప్రాజెక్టు ఒకటి, రెండు మినహా దాదాపు ఈ ఏడాది డిసెంబర్ నాటికల్లా పూర్తి చేస్తామని, వచ్చే ఏడాది మార్చి నాటికల్లా వంద శాతం మేర ప్రాజెక్టు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
31 మురుగునీటి శుద్ధి కేంద్రాలు అందుబాటులోకొస్తే నగరంలో వందశాతం మురుగు శుద్ధి అవుతుంది. ప్రభుత్వ లక్ష్యం, సవాళ్లు అధిగమిస్తూ సకాలంలో పనులు నిర్వహిస్తున్న జలమండలి ఉన్నతాధికారులను పురపాలక మంత్రి కేటీఆర్ ఆదివారం ట్విట్టర్ వేదికగా ప్రశంసించారు. వచ్చే మార్చి నాటికి పనులన్నీ పూర్తయితే దేశంలో 100శాతం మురుగుశుద్ధి చేస్తున్న నగరంగా గుర్తింపు రానుందని పురపాలక శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి అర్వింద్‌కుమార్ మరో ట్వీట్ చేశారు.