సిటీబ్యూరో, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ) : స్పెషల్ సమ్మరీ రివిజన్ 2023 ప్రకారం జనవరి 1 తేదీ 2023 నాటికి 18 సంవత్సరాల వయస్సు నిండిన ప్రతి ఒకరూ తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. www. nvsp.in వెబ్ సైట్లో నూతన ఓటరు అయితే ఫారం 6 ద్వారా దరఖాస్తు నమోదు చేసుకోవాలి. ఇంతకు ముందు ఓటరు జాబితాలో పేరు నమోదై ఉన్న వారు ఫాం 6బీ ద్వారా నమోదు చేసుకోవాలి. ఈ నమోదు సందర్భంగా ఇరువురు (నూతన ఓటరు, ఇంతకు ముందు ఓటరు జాబితాలో పేరున్న వారు) కూడా ఆధార్ కార్డు ఉన్న వారు ఇష్టముంటే ఆధార్ జత చేయాలి. లేని పక్షంలో సూచించిన 11 పత్రాల్లో ఏదైనా ఒకటి జత చేయాలి. అదే విధంగా ఆధార్ కార్డులేని వారు కూడా అవే 11 పత్రాల్లో ఏదో ఒకటి జత చేయాలన్నారు. కాగా, ఆఫ్ లైన్ ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చు. దరఖాస్తులు, సంబంధిత ధ్రువీకరణ పత్రాలు పోలింగ్ బూత్ లెవెల్ వద్ద ఈఆర్వోకు ఇవ్వవచ్చు.
18 సంవత్సరాలు నిండిన ఓటరు, జాబితాలో పేరు లేని వారు నమోదుకు కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్ర ఎన్నికల సీఈవో ఇచ్చిన మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ కోరారు. ప్రస్తుత ఓటరు జాబితాలో పేరు ఉన్న వారు మార్పులు, చేర్పుల కోసం ఫారం-8 వినియోగించుకోవాలి. ఓటరు జాబితాలో ఇంటి అడ్రస్, ఎన్నికల ఫొటో గుర్తింపు కార్డులో తప్పులు సరి చేసుకోవడం, పోగొట్టుకుంటే, చినిగిపోయినా.. మరొకటి తీసుకోవడం కోసం ఫారం-8 ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఓటరు జాబితాలోని పేరు తొలగింపునకు ఫారం 7 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చునని కమిషనర్ సూచించారు.