సిటీబ్యూరో, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): రద్దీ సమయాల్లో ట్రాఫిక్‌లో వాహనదారులు ఇబ్బందులు పడకుండా ఉండేలా వన్‌వేలు ఏర్పాటు చేసే దిశగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కసరత్తు మొదలు పెట్టారు. ఇందులో భాగంగా కూడళ్లలో ట్రాఫిక్ సమస్యను అంచనా వేసేందుకు డ్రోన్లు కూడా కొనాలనే ఆలోచన చేస్తున్నారు. వాహనదారులు ట్రాఫిక్‌తో ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకోవడం కోసం ఫీల్డ్ సర్వే చేస్తున్నారు. ఈ సర్వే ప్రకారం ఏ జంక్షన్లో వాహనాలు ఎంత సేపు దాటుతున్నాయి..? దాటేందుకు ఎంత సమయ పడుతుంది..? అనే విషయాలను తెలుసుకుంటున్నారు.
80 లక్షలకు..
తెలంగాణ ఏర్పాటు కాకముందు ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో 40 లక్షల వాహనాలుండేవి, నేడు వాటి సంఖ్య 80 లక్షలకు పెరిగింది. శివారు ప్రాంతాలు విస్తరిస్తూ, రోడ్లు విశాలంగా మారుస్తూ.. ఫ్లైఓర్లు నిర్మిస్తూ.. ట్రాఫిక్ సమస్యకు చెక్పెడుతున్నా.. నగరం లోపల ప్రధాన కూడళ్లకు వచ్చే వరకు రద్దీ నెలకొంటుంది. చాదర్‌ఘాట్ నుంచి కోఠికి చేరుకునేందుకు రద్దీ సమయాల్లో సుమారు 20 నిమిషాల నుంచి 30 నిమిషాల సమయం పడుతుందని క్షేత్ర స్థాయి సర్వేలో వెల్లడైంది. అలాగే జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, సికింద్రాబాద్ సీటీవో జంక్షన్, రోడ్డు నం. 45 జంక్షన్ ఇలా పలు కూడళ్లలో పోలీసులు క్షేత్ర స్థాయిలో ఫీల్డ్ సర్వేలు చేపట్టారు.
ఒక్కో చోట.. ఒక్కో రకంగా..
ఉదయం 8 నుంచి 11, సాయంత్రం 5 నుంచి 8 గంటల మధ్య నగరంలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుంది. కార్యాలయాలు, పాఠశాలలు, వ్యాపారాలకు వెళ్లే, తిరిగి వచ్చే సమయాల్లో రోడ్లన్నీ వాహనాలతో కిక్కిరిసిపోతాయి. దీంతో ప్రత్యేకమైన ఈ సమయాలను పరిగణలోకి తీసుకొని ఏ కూడలిలో ఏం చేస్తే ట్రాఫిక్ సాఫీగా సాగుతుందనే విషయంపై పోలీసులు అధ్యయనం చేస్తున్నారు. ఈ అధ్యయనంలో అవసరమైన చోట వన్‌వేలు, రోడ్లు మూసివేయడం, యూ టర్న్‌లు, సిగ్నల్ ఆపివేయడం వంటి వాటిపై ఆరా తీస్తున్నారు.
డ్రోన్లతో అంచనా వేసి..
డ్రోన్లతో ట్రాఫిక్‌ను అంచనా వేసేందుకు వీలుంటుంది. ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద కూర్చున్న కానిస్టేబుల్, ఇతర అధికారులకు ట్రాఫిక్ ఎంత దూరంలో నుంచి ఆగిపోయింది..? అందుకు కారణాలేమిటీ తెలుసుకోవడం కష్టం. అలాగే ట్రాఫిక్ ఎంత దూరంలో ఆగిపోయింది..? ఆగిపోయిన ట్రాఫిక్ ఎంత సేపట్లో క్లియర్ అవుతుందనే విషయంలోనూ స్పష్టంగా తెలియదు. అందుకే డ్రోన్ కెమెరాలు ఉపయోగిస్తే… కూడళ్లలో ట్రాఫిక్ ఎంత మేర ఆగిపోయింది..? ఎంత సేపట్లో క్లియర్ అవుతుందనే విషయంపై తెలుసుకునేందుకు వీలుంటుంది. ట్రాఫిక్ విభాగంలోకి రెండు మూడు డ్రోన్లు కొనాలనే ఆలోచన చేస్తున్నారు. ఇందుకు పెద్ద ఖర్చుకూడా కాకపోవడం, ప్రయోజనాలు ఎక్కువగా ఉండడంతో ఉన్నతాధికారులు ఈ విషయంపై చర్చించి, నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.