మేడ్చల్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): నూతనంగా మంజూరైన ఆసరా పింఛన్ల కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలో మంగళవారం నుంచి ప్రారంభించనున్నారు. మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాలకు 48,558 ఆసరా పింఛన్లను ప్రభుత్వం మంజూరు చేసింది. దీంతో జిల్లాలో ఆసరా పింఛన్ల లబ్ధిదారుల సంఖ్య 1,52,008 చేరుకుంది. ఇందులో వృద్ధాప్య, వితంతు, వికలాంగులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, ఒంటరి మహిళ, బోదకాలు ఉన్నవారికి ఆసరా పింఛన్లు అందుతున్నాయి. నూతనంగా మంజూరైన ఆసరా పింఛన్ కార్డులను స్థానిక ఎమ్మెల్యేలు నేరుగా లబ్ధిదారులకు అందజేయనున్నారు. సీఎం కేసీఆర్ కుటుంబ పెద్దగా అండగా ఉన్నారంటూ కొత్తగా పింఛన్ అందుకుంటున్న లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి చామకూర మల్లారెడ్డి మంగళవారం మేడ్చల్ నియోజకవర్గంలోని పోచారం (మున్సిపాలిటీ) కీసర మండల కేంద్రం, పీర్జాదిగూడ (కార్పొరేషన్)లో లబ్ధిదారులకు పింఛన్ కార్డులను అందజేయనున్నారు.
లబ్ధిదారులకు నేరుగా పింఛన్ కార్డులు అందజేత
జిల్లాలో నూతనంగా మంజూరైన ఆసరా పింఛన్ కార్డులను నేరుగా లబ్ధిదారులకు అందజేస్తాం. జిల్లాకు కొత్తగా 48,558 ఆసరా పింఛన్లను ప్రభుత్వం మంజూరు చేసింది. వృద్ధులకు భరోసాగా ఉండేందుకు అర్హులందరికీ ఆసరా పింఛన్లను ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. 57 ఏండ్లు దాటిన వారందరికీ ఆసరా పింఛన్లను అందిస్తామని ఇచ్చిన హామీని సీఎం కేసీఆర్ నిలబెట్టుకున్నారు. నూతనంగా మంజూరైన ఆసరా పింఛన్ల లబ్ధిదారుల తరఫున సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. – మంత్రి మల్లారెడ్డి