సిటీబ్యూరో, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ) : జర్మనీలో పుట్టాను.. లండన్‌లో పెరిగాను.. నీ కోసం రెండు దేశాల్లో ఉన్న ఆస్తులను అమ్మేసి.. ఆ సొమ్ముతో భారతదేశానికి వచ్చి నిన్నుపెండ్లి చేసుకొని అక్కడే ఉంటానని నమ్మబలికిన ఓ సైబర్‌చీటర్ సికింద్రాబాద్‌కు చెందిన బాధితురాలి వద్ద రూ.6 లక్షలు కాజేశాడు. వివరాల్లోకి వెళితే.. సికింద్రాబాద్‌కు చెందిన బాధితురాలు క్రిస్టియన్ మ్యాట్రీమోనీలో ప్రొఫైల్ అప్లోడ్ చేసింది. దాన్ని చూసిన ఓ గుర్తుతెలియని వ్యక్తి తాను జర్మనీలో ఉంటున్నానని పెండ్లి చేసుకోవడానికి సిద్ధమని మ్యాట్రీమోనీలో పరిచయం చేసుకున్నాడు. కొన్నాళ్లు ఇద్దరు ఒకరి గురించి మరొకరు మాట్లాడుకున్నారు. ఆ తరువాత తనకు జర్మనీలో, లండన్‌లో ఉన్న ఆస్తిని అమ్మేసి నీ దగ్గరకు వచ్చేస్తా, హైదరాబాద్‌లోనే ఉండేందుకు ఏర్పాట్లు చేయమంటూ సూచించాడు. రెండు, మూడు రోజుల తరువాత తాము ఎయిర్‌పోర్టు నుంచి మాట్లాడుతున్నామని, ఫలానా వ్యక్తి వద్ద భారీ ఎత్తున లండన్ పౌండ్లు, బంగారం, వజ్రాలు ఉన్నాయని, దానిపై మీ చిరునామా ఉందంటూ ఫోన్లో మాట్లాడారు. కస్టమ్స్ పీజు, ఆదాయపన్ను, జీఎస్టీ, యాంటీ టెర్రరిస్ట్ ఎన్ఓసీ తదితర పేర్లు చెబుతూ రూ.6 లక్షలు డిపాజిట్ చేయించారు. ఇంకా డబ్బు కావాలంటూ అడుగుతుండటంతో ఇదంతా మోసమని గుర్తించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
లింకులు పంపారు.. లూటీ చేశారు..!
అధిక ఆశకు పోయిన ఖైరతాబాద్‌కు చెందిన ఓ వ్యక్తికి సైబర్ చీటర్స్ రూ.9లక్షలు టోకరా వేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితుడి ఫోన్‌కు వచ్చిన మెసేజ్‌ను చూసి, అందులో ఉన్న లింక్‌ను క్లిక్ చేయడంతో వాట్సాప్‌లోకి వెళ్లాడు. అక్కడ మంచి లాభాలొస్తాయంటూ ఆ గ్రూప్ నిర్వాహకులు చెప్పి మరో లింక్‌ను వాట్సాప్‌లో ఇచ్చారు. ఆ వాట్సాప్ లింక్ క్లిక్ చేయగానే టెలిగ్రామ్ యాప్‌లోకి., అక్కడ మరో లింక్‌ను క్లిక్ చేయించడంతో డబ్ల్యూడిడబ్ల్యూడి.ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్లాడు. అక్కడ మొదట వంద రూపాయలు పెట్టుబడి పెట్టడంతో రూ. 227 తిరిగి బ్యాంకు ఖాతాలో క్రెడిట్ అయ్యాయి. పెట్టుబడి వంద రూపాయలు పోను రూ.127 లాభం రావడంతో ఇదంతా నిజమని నమ్మి.. నెమ్మదిగా వందలు, వేలు పెట్టుబడి పెడుతూ వెళ్లాడు. ఆ స్క్రీన్‌పై భారీ లాభాలు కనిపిస్తుండగా వాటిని రేపు, మాపు డ్రా చేసుకోవచ్చని నిర్వాహకులు ఆశ పెట్టారు. మోసాన్ని గుర్తించలేకపోవడంతో రెండు రోజుల్లోనే రూ.9 లక్షలు పెట్టుబడిగా పెట్టాడు. డబ్బు తీసుకోవడానికి అవకాశం లేకపోవడంతో ఇదంతా మోసమని గుర్తించి సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.