పీర్జాదిగూడ, ఆగస్టు 29 : గణేశ్ ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించుకోవాలని మల్కాజిగిరి జోన్ ఏసీపీ నరేశ్‌రెడ్డి సూచించారు. సోమవారం మేడిపల్లి మండల కేంద్రంలోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో పీర్జాదిగూడ, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఉత్సవ నిర్వాహకులు, ప్రజాప్రతినిధులు, యువజన సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ మండపాల ఏర్పాటుకు పోలీసుల అనుమతి తీసుకోవాలని, విగ్రహాల ఏర్పాటుకు ఆన్లైన్లో దరఖాస్తు చేయాలని సూచించారు. విద్యుత్ సరఫరా విషయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. మట్టితో తయారు చేసిన గణపతి ప్రతిమలను పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలని పీర్జాదిగూడ మేయర్ వెంకట్‌రెడ్డి సూచించారు. మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించిన వారికి ప్రోత్సాహకం అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో పీర్జాదిగూడ కమిషనర్ రామకృష్ణారావు, మేడిపల్లి ఇన్స్పెక్టర్ గోవర్ధనగిరి, నాయకులు, యువజన సంఘాలు, కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు, నిర్వాహకులు పాల్గొన్నారు.
మేడ్చల్‌లో…
మేడ్చల్ రూరల్, ఆగస్టు 29 :గణేశ్ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని సీఐ రాజశేఖర్ రెడ్డి నిర్వాహకులకు సూచించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం మేడ్చల్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో వినాయక మండపాల ఏర్పాటుపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండపాల నిర్వాహకులు పోలీస్‌స్టేషన్‌లో విధిగా సమాచారం ఇవ్వాలని, ఆన్లైన్లో నమోదు చేసుకోవాలన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో మండపాల నిర్వాహకులు పోలీసులకు సహకారం అందించాలని సూచించారు. అన్ని విగ్రహాలను 11 రోజుల్లో నిమజ్జనం చేయాలని, అంతకంటే ఎక్కువ రోజులు పెట్టుకోవద్దని సూచించారు. నిమజ్జనానికి సుతారిగూడ చెరువు వద్ద ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ సమావేశంలో ఎస్సై రఘురాం, మండపాల నిర్వాహకులు, యువకులు పాల్గొన్నారు.