బేగంపేట, ఆగస్టు 28: మట్టి గణపతి విగ్రహాలను పూజించి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. ఆదివారం సనత్‌నగర్ నియోజకర్గంలోని పద్మారావునగర్ పార్కులో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గణేశ్ నవరాత్రుల సందర్భంగా 6 లక్షల మట్టి విగ్రహాలను జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. సికింద్రాబాద్ జోన్ పరిధిలో 42 వేల విగ్రహాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, కలర్స్‌తో చేసిన విగ్రహాలతో పర్యావరణం దెబ్బతినే అవకాశం ఉన్నదని, మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించాలని కోరారు. ఈ క్రమంలో పద్మారావునగర్ పార్కులో వనదుర్గ మాతను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి , కార్పొరేటర్ హేమలత తదితరులు పాల్గొన్నారు.
హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ
సిటీబ్యూరో, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): పర్యావరణ పరిరక్షణ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) గ్రేటర్ పరిధిలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ చేపట్టింది. ఆదివారం నగరంలోని 41 కేంద్రాల్లో ఉచితంగా మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. ఎంపిక చేసిన మరిన్ని కేంద్రాల్లో మట్టి విగ్రహాలను గురువారం సైతం పంపిణీ చేస్తామని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. మొత్తం లక్ష మట్టి విగ్రహాలను తయారు చేయించి పంపిణీ చేస్తున్నామని, నగర వాసులు మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు నిర్వహించాలని అధికారులు సూచించారు. అమీర్‌పేటలోని హెచ్ఎండీఏ ప్రధాన కార్యాలయం మైత్రీవనం, స్వర్ణజయంతి కాంప్లెక్స్, ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ గార్డెన్, కేబీఆర్ పార్కు ప్రాంతాల్లో పంపిణీ చేశామని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు.