బోడుప్పల్, ఆగస్టు 28 : బోడుప్పల్, బీబీనగర్ సమీపంలోని జైనపల్లిలో శ్రీ శంకర విద్యాభారతి గో సంరక్షణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గోసంరక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఎనిమల్ వెల్ఫేర్ బోర్డు ఆఫ్ ఇండియాచే గుర్తింపు పొందిన ఈ ట్రస్ట్.. గోవుల నుంచి వెలువడే వ్యర్థాలతో పర్యావరణ పరిరక్షణను కాంక్షిస్తూ గో ఉత్పత్తులపై నిరంతరం అధ్యయనం చేస్తున్నారు.
ఆదివారం ‘నమస్తే తెలంగాణ’తో శ్రీ శంకర విద్యాభారతి ట్రస్ట్ నిర్వాహకులు కుప్ప శ్రీనివాస్ ప్రసాద్ అనేక ఆసక్తికర అంశాలను వెల్లడించారు. పర్యావరణ హితాన్ని కాంక్షించే సమాజంలోని ప్రతి ఒక్కరూ గోమయం, మట్టితో తయారు చేసిన విగ్రహాలనే ఆరాధించాలన్నారు. మానవాళి మనుగడ ప్రశ్నార్థకంలోకి నెట్టివేయబడక ముందే సమాజం మేలుకోవాలన్నారు.
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడుదామన్నారు. శ్రీశంకర విద్యాభారతి గో సంరక్షణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 200లకు పైగా ఉత్పత్తులను తయారు చేస్తున్నామని, ఇందులో ఎలాంటి లాభాపేక్ష లేదన్నారు. గోమయం, మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలను మాత్రమే పూజిద్దామన్నారు. గోమయ విగ్రహారాధన కోసం 984947 4437లో సంప్రదించాలన్నారు.