మియాపూర్/కొండాపూర్, ఆగస్టు 28 : దళితబంధు పథకం ఎంతో మంది పేద దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నదని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. దళితబంధులో భాగంగా చందానగర్ డివిజన్ అన్నపూర్ణ ఎన్క్లేవ్ హరిజన బస్తీకి చెందిన జ్యోతికి మంజూరైన కిరాణ, జనరల్ స్టోర్‌ను ఆదివారం కార్పొరేటర్ మంజుల రఘునాథరెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. అదేవిధంగా చందానగర్ డివిజన్ వేమనకాలనీ వీకర్ సెక్షన్‌కు చెందిన మౌలాలికి మంజూరైన కారును కార్పొరేటర్లు మంజులరెడ్డి, రోజాదేవిలతో కలిసి విప్ గాంధీ మియాపూర్‌లోని తన కార్యాలయంలో అందించారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ముందు చూపుతో దళితబంధును ప్రవేశపెట్టి దళితులను అభివృద్ధి పథంలోకి తీసుకువస్తున్నారని అన్నారు. దళితులు ఉపాధి కోసం వెతికే పరిస్థితి నుంచి మరింత మందికి ఉపాధినందించే స్థాయికి తీసుకువచ్చేందుకు ఈ పథకం ఎంతగానో తోడ్పాటునిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథరెడ్డి, నాయకులు మిర్యాల రాఘవరావు, నరేందర్, వరలక్ష్మి, మల్లేశ్, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.
దళితులను ధనవంతులను చేసేలా..!
దళితులను ధనవంతులను చేసేలా సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇప్పటికే దళితబంధు పథకం పొందిన లబ్ధిదారులు వ్యాపారాలు చేసుకుంటూ కొత్త జీవితాలను ప్రారంభించారు. దళితులకు భరోసా ఇచ్చే పథకాన్ని అడ్డుకోవాలని చూస్తే సహించేది లేదు. సీఎం కేసీఆర్ కలలు నిజం చేసేలా దళితులు కష్టపడి వ్యాపారాలు చేసుకుంటున్నారు.
-గంగాధరి కృష్ణ, షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సమితి కార్యదర్శి
కుటిల వ్యాఖ్యలు మానుకోవాలి
ఆర్థిక, సామాజిక, రాజకీయ అసమానతలను ఎదుర్కొంటున్న దళితుల జీవితాలను మార్చేందుకు సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ఈ పథకం ద్వారా కేవలం తెలంగాణలో దళిత కుటుంబాలకు స్వయం ఉపాధి నిమిత్తం ప్రత్యక్షంగా లబ్ధిని కల్పిస్తున్నారు. ఇలాంటి ప్రతిష్టాత్మకమైన పథకంపై దుష్ర్పచారం సరికాదు. కొందరు పనికట్టుకొని ప్రజల్లో అపోహలను పెంచేందుకు యత్నిస్తున్నారు. ఇలాంటి కుటిల వ్యాఖ్యలను మానుకోవాలి. దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారు. తమ వ్యక్తిగత ప్రాబల్యం కోసం దళిత బంధు పథకంపై నోరుపారేసుకోవద్దు.
– బి.రఘునాథ్‌రావు, అధ్యక్షుడు, ఎస్సీ సెల్, శేరిలింగంపల్లి