తెలుగు యూనివర్సిటీ, ఆగస్టు 28: సమాజ సేవకులకు పురస్కారాలు, అవార్డులు స్ఫూర్తిని నింపి మరింతగా సేవ చేసేందుకు ఉత్సాహాన్ని నింపుతాయని బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు అన్నారు. కీర్తి ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఆదర్శనగర్లో గల బీఎం బిర్లా సైన్స్ సెంటర్ ప్రాంగణంలో గల భాస్కర ఆడిటోరియంలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విశిష్ట నంది పురస్కారాలు, శ్రీ కృష్ణాష్టమిని పురస్కరించుకుని నృత్య గురువులకు, కళాకారులకు నాట్యమయూరి పురస్కారాలు పురస్కరించుకుని వివిధ రంగాలలో విశేష సేవలందిస్తున్న పలువురికి పురస్కారాల ప్రదానోత్సవం ఆదివారం సాయంత్రం ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా పలువురు ఔత్సాహిక కళాకారులు వేదికపై ప్రదర్శించిన శాస్త్రీయ నృత్యాంశాలు ఆహూతులను విశేషంగా అలరించాయి. అనంతరం, జరిగిన సభలో బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుల స్ఫూర్తితో అన్ని రంగాలలో అభివృద్ధిని సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ మాజీ విప్ రుద్రరాజు పద్మరాజు, సరస్వతి ఉపాసకులు దైవజ్ఞ శర్మ, ప్రఖ్యాత నృత్య గురువులు డాక్టర్ పసుమర్తి శేషుబాబు, డాక్టర్ మామిడి అనితారెడ్డి, నటులు కిరణ్ కుమార్తో పాటు కీర్తి ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపకురాలు లిమ్మ బిందు పాల్గొని పురస్కార గ్రహీతల సేవలను కొనియాడారు.