బేగంపేట్, ఆగస్టు 27: డబుల్ ఇండ్ల కోసం ఎవ్వరూ డబ్బులివ్వొద్దని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. దరఖాస్తు పరిశీలన పూర్తిగా ఉచితమని, ఎవరైనా సిబ్బంది డబ్బులు అడిగితే జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని నగరవాసులకు సూచించారు. సికింద్రాబాద్ ఉత్తర మండలం బేగంపేట్ సర్కిల్ పరిధిలో డబుల్ బెడ్రూం ఇండ్ల దరఖాస్తుల పరిశీలన ముమ్మరంగా సాగుతున్నది. అయితే కొందరు బల్దియా కిందిస్థాయి సిబ్బంది తమకు అధికారుల నుంచి ఆదేశాలు ఉన్నాయంటూ.. ఒక్కో దరఖాస్తుదారుడి నుంచి వద్ద రూ. 100 వసూలు చేస్తున్నారు. దీంతో అనేక మంది తెలియక డబ్బులు ముట్టజెప్పుతున్నారు.
ప్రతి రోజు వందల సంఖ్యలో దరఖాస్తుల పరిశీలన జరుగుతుండటంతో ఇలా వసూళ్లకు పాల్పడేవారిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. కాగా, ఈ విషయమై మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ స్పందించారు. డబ్బులు తీసుకునే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే ఫిర్యాదు చేయాలని సూచించారు. కొందరు సిబ్బంది డబ్బులు తీసుకున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, వారిపై చర్యలు తీసుకుంటామని బేగంపేట సర్కిల్ డీసీ ముకుందరెడ్డి చెప్పారు. ఎవరూ దరఖాస్తులు పరిశీలన చేసే సిబ్బందికి డబ్బులు ఇవ్వొద్దని, ఒకవేళ ఎవరైనా డబ్బులు అడిగితే సర్కిల్ కార్యాలయానికి (నంబర్ 90001 13021) ఫిర్యాదు చేయాలని సూచించారు.