చార్మినార్, ఆగస్ట్ 27: సిటీ కాలేజీలో అడుగుపెడితే ఒక రకమైన పులకింత కలిగిందని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. సిటీ కాలేజీ శతాబ్ది వేడుకల్లో భాగంగా ఆయన శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ కాలేజీ విద్యార్థులు చైతన్య, ఉద్యమ స్ఫూర్తికి మారు రూపాలన్నారు. మలి దశ ఉద్యమంలో సిటీ కాలేజీ ఉద్యమకారులకు ఊతమిచ్చిందన్నారు. ఇక్కడ విద్యాభ్యాసమంటే సమాజాన్ని సంపూర్ణంగా శోధించడమేనన్నారు. శత వసంతాలను నిర్వహించుకోవడం ద్వారా కాలేజీ చరిత్రను నేటి తరానికి తెలియజేయడమేనని పేర్కొన్నారు.
సిటీ కాలేజీ నిర్వహించే ఏ కార్యక్రమానికైనా భాషా సంస్కృతిక శాఖ ఆర్థి, హార్థిక సహకారం ఉంటున్నదన్నారు. కుల మతాలను మనం సృష్టించుకున్న అడ్డుగోడలని, వాటికి అతీతంగా మత సామరస్యాన్ని, జాతీయ సమైక్యతను ప్రతి విద్యార్థి చాటి చెప్పాలని సూచించారు. విద్యార్థులకు తమ తల్లిదండ్రులు, గురువులు, గ్రామం పట్ల అపారమైన ప్రేమ, బాధ్యతలు కలిగి ఉండాలన్నారు. ప్రతి విద్యార్థికి ఒక ప్రత్యేక లక్ష్యం ఉండాలని, దాని సాధన కోసం కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ బాలభాస్కర్, వైస్ ప్రిన్సిపాల్ ఐజాజ్ సుల్తానా, అధ్యాపకులు యాదయ్య, రత్న ప్రభాకర్ పాల్గొన్నారు.