సిటీబ్యూరో, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): ప్రజలు ఎలాంటి వదంతులు నమ్మవద్దని, సోషల్ మీడియాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా రెచ్చగొట్టే ప్రచారాలు చేసినా కఠిన చర్యలు తప్పవని సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర హెచ్చరించారు. వినాయక నవరాత్రులను పురస్కరించుకుని బుధవారం మాదాపూర్‌లోని సీసీఆర్టీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ఇంటర్ డిపార్ట్మెంటల్ సమన్వయ సమావేశంలో జీహెచ్ఎంసీ, హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్బీ, టీఎస్ఎస్పీడీసీఎల్, ఫైర్ సర్వీసెస్, ఇమ్మిగ్రేషన్, రోడ్ ట్రాన్స్పోర్ట్, ఆర్అండ్బీ, మెడికల్ అండ్ హెల్త్ తదితర ప్రభుత్వ శాఖలతో పాటు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ రవీంద్ర మాట్లాడుతూ ఈ నెల 31 నుంచి ప్రారంభమయ్యే వినాయక చవితి ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో ఘనంగా జరుపుకోవాలని, అందుకోసం అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో కలిసి పనిచేయాలని సూచించారు.
విగ్రహాల ప్రతిష్టాపన విషయంలో నిర్వాహకులతో అన్ని ప్రాంతాల ఇన్స్పెక్టర్లు ముందుగానే సమావేశమై ఏర్పాట్లపై సమీక్షించాలని సూచించారు. మండపాలు ఏర్పాటు చేసుకునేవారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని, నిమజ్జనానికి వచ్చే వారితో మర్యాదగా ప్రవర్తించాలని, క్షేత్రస్థాయి సిబ్బందికి సూచించామన్నారు. నిమజ్జనం జరిగే చెరువుల వద్ద ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలకు ఇబ్బందులు తలెత్తకుండా జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ సిబ్బంది అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.
నవరాత్రుల సందర్భంగా 10రోజుల పాటు సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా ఉంటుందని సీపీ తెలిపారు. ప్రజలు ఎలాంటి వదంతులు నమ్మవద్దని, సమస్యలుంటే స్థానిక పోలీసులకు లేదా 100 నంబర్‌కు డయల్ చేసి సమాచారం అందించాలని సూచించారు. ఈ సమావేశంలో సైబరాబాద్ జాయింట్ కమిషనర్ అవినాష్ మహంతి, మేడ్చల్-మల్కాజిగిరి అదనపు కలెక్టర్ జాన్ శామ్సన్, క్రైం డీసీపీ కల్మేశ్వర్, ట్రాఫిక్ డీసీపీ టి.శ్రీనివాస్‌రావు, రాజేంద్రనగర్ ఆర్డీవో చంద్రకళ, కూకట్పల్లి జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ మమత, మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి, బాలానగర్ డీసీపీ సందీప్, శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి, డీటీసీ ప్రవీణ్‌రావు పాల్గొన్నారు.