సిటీబ్యూరో, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): కస్టమర్ కేర్ ప్రతినిధులమంటూ నమ్మించి ఓ ప్రభుత్వ ఉద్యోగి పాన్, ఆధార్ కార్డులను తీసుకొని, దాని ద్వారా చిటికెలో రుణం పొంది రూ. 7.5 లక్షలు సైబర్ చీటర్స్ మోసం చేశారు. రుణం తీసి, దాన్ని బాధితుడి ఖాతాలో క్రెడిట్ చేయించి, ఆ మొత్తాన్ని ఎనీడెస్క్ యాప్ సహాయంతో ఆ ఖాతాలో నుంచి కాజేశారు. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అంబర్‌పేట్‌కు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగికి ఐసీఐసీఐ బ్యాంకు కస్టమర్ కేర్ నంబర్ కోసం గూగుల్‌లో సెర్చ్ చేసి, ఓ నంబర్‌ను గుర్తించాడు. ఆ నంబర్‌కు ఫోన్ చేయడంతో ఎవరూ లిఫ్ట్ చేయలేదు.
వెంటనే తిరిగి తాము కస్టమర్ కేర్ నుంచి ఫోన్ చేస్తున్నామని సైబర్‌చీటర్స్ మాట్లాడారు. అయితే ఎనీ డెస్క్ యాప్ డౌన్లోడ్ చేస్తే మీ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో చెప్తామని తెలిపారు. వారి సూచనల మేరకు బాధితుడు వెంటనే డౌన్లోడ్ చేశాడు. ఆ తరువాత డెబిట్ కార్డు వివరాలు, ఓటీపీ తెలుసుకున్నారు. పాన్ కార్డు, ఆధార్‌కార్డులు పంపించమని నేరగాళ్లు తెలుపగా పంపించాడు. ఆ తరువాత రెండు గంటల వ్యవధిలో రూ.7 లక్షలు బాధితుడి ఖాతాలో జమయ్యాయి. నిమిషాల వ్యవధిలోనే ఖాళీ అయ్యాయి. ఇదంతా జనవరిలో జరిగింది.
అప్పటికే ఆ బ్యాంకు నుంచి ఇంటిపై రుణం తీసుకొన్న బాధితుడు నెలవారి వాయిదాలు సక్రమంగా చెల్లిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడి పేరుతో ఈజీగా రుణం మంజూరైంది. కాగా ఆరు నెలల తరువాత మీరు తీసుకున్న రుణం వెంటనే చెల్లించాలంటూ నోటీసులు రావడం ప్రారంభమయ్యాయి. రుణం చెల్లించకుంటే మీరు ఇంటిపై తీసుకున్న రుణానికి సెక్యూరిటీగా పెట్టిన డాక్యుమెంట్లను జప్తు చేస్తామంటూ బ్యాంకు అధికారులు హెచ్చరించారు. తాను రుణం పొందలేదంటూ బ్యాంకుకు చెప్పినా లాభం లేకుండా పోయింది. చేసేది లేక బాధితుడు బుధవారం సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.ఝాన్సీబజార్‌కు చెందిన ఓ వ్యాపారికి సైబర్‌నేరగాళ్లు కస్టమర్ కేర్ నంబర్‌కు ఫోన్ చేస్తే, ఎనీడెస్క్ యాప్ డౌన్లోడ్ చేయించి రూ. 2.5 లక్షలు బ్యాంకు ఖాతా నుంచి కాజేశారు.
కాచిగూడ, ఆగస్టు 24 : గుర్తుతెలియని వ్యక్తి ఫోన్లో మాయమాటలు చెప్పి రూ.32,400 తస్కరించిన ఘటన కాచిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ సంపత్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. బర్కత్‌పురలోని బసంత్కాలనీ ప్రాంతానికి చెందిన శివశంకర్ కూతురు స్వాతిసంకర్(29) డాక్టర్. ఓఎల్ఎక్స్లో వస్తువులను అమ్మకానికి పెట్టారు. ఇదే అదునుగా భావించిన గుర్తుతెలియని వ్యక్తి వస్తువులు కొంటామని చెప్పి మాయమాటలతో ఓటీపీ నంబర్ సేకరించి బ్యాంకు ఖాతాలోనుంచి రూ.32,400 కాజేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
హిమాయత్‌నగర్, ఆగస్టు 24 : ఎలక్ట్రిసిటీ బోర్డు కొనుగోలు చేసేందుకు గూగుల్‌లో వెతికిన ఓ యువకుడు సైబర్ నేరగాళ్లకు చిక్కి రూ.73వేలు పోగొట్టుకున్న సంఘటన బుధవారం నారాయణగూడ పీఎస్ పరిధిలో చోటు చేసుకున్నది. సీఐ రాపోలు శ్రీనివాస్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హిమాయత్‌నగర్‌కు చెందిన మహ్మద్ రశీద్ అలీ తన్వీర్ స్థానికంగా ఓ ప్రైవేట్ కాలేజీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల ఎలక్ట్రిసిటీ బోర్డు కోసం గూగుల్‌లో సెర్చ్ చేసి సైబర్ నేరగాళ్లకు చిక్కాడు. తన్వీర్‌ను ఫోన్లో ఓ యాప్‌ను డౌన్లోడ్ చేయించిన నేరగాళ్లు ఖాతాలోనుంచి రూ.73 వేలు లూటీ చేశారు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.