సిటీబ్యూరో, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ):చదువు మానేసిన వారిని, ఫెయిల్ అయిన వారిని ఎంచుకొని వారి నుంచి లక్షలు దండుకొని ఫొటో షాప్‌లో యూనివర్సిటీల పేరుతో తయారు చేసిన నకిలీ సర్టిఫికెట్లను అంటగడుతున్న ముఠాను ఎల్బీనగర్ ఎస్ఓటీ, బాలాపూర్ పోలీసులతో కలిసి అరెస్టు చేశారు. వారి నుంచి పలు యూనివర్సిటీలకు చెందిన నకిలీ సర్టిఫికెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను మంగళవారం రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ వెల్లడించారు. చాంద్రాయణగుట్టకు చెందిన పాత నేరస్తుడు మహ్మద్ ఖలీముద్దీన్ అలియాస్ ఖలీల్‌పై చాంద్రాయణగుట్ట, అబిడ్స్ పోలీస్ స్టేషన్లలో గతంలో కేసులు నమోదయ్యాయి.
తన స్నేహితుడైన గోల్కొండకు చెందిన ముక్తార్ అహ్మద్‌కు ఫొటో షాప్‌లో శిక్షణ ఇచ్చి నకిలీ సర్టిఫికెట్ల తయారీలో తనకు సహాయకుడిగా నియమించుకున్నాడు. సర్టిఫికెట్ల తయారీతో పాటు నకిలీ సర్టిఫికెట్లు అవసరమైన వారిని గుర్తించే ఏజెంట్‌గా ముక్తార్ కొనసాగుతున్నాడు. ఇతడు రాజేంద్రనగర్‌కు చెందిన టీచర్ ఎండీ ఫిరోజ్, దుండిగల్‌లోని రుయ్ నిజామియా మాస్క్ ఇమామ్‌గా ఉన్న లక్డికాపూల్‌కు చెందిన ఎండీ ఫరూఖ్ అజీజ్, టోలిచౌకి ప్రాంతానికి చెందిన ఐటీ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్న ఎండీ సరూఖ్ ఉల్లాఖాన్లను సబ్ ఏజెంట్లుగా నియమించుకున్నాడు.
చదువు ఆపేసిన వారిని ఎంచుకొని..!
చదువు మధ్యలో ఆపేసిన వారు, వివిధ కోర్సుల్లో ఫెయిల్ అయిన వారిని ఎంచుకుంటారు. వారికి కావాల్సిన సర్టిఫికెట్లు ఇప్పిస్తామని నమ్మించి ఒక్కో సర్టిఫికెట్‌కు రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు వసూలు చేస్తారు. ఇందులో సబ్ ఏజెంట్లు పది వేలు, ప్రధాన ఏజెంట్ 25 శాతం కమిషన్ తీసుకొని మిగతావి సూత్రధారి ఖలీమ్‌కు అందజేస్తారు.
అవసరాలను బట్టి సర్టిఫికెట్లు
బోర్డు అఫ్ ఇంటర్మీడియట్ సర్టిఫికెట్(ఏపీ), మహారాష్ట్ర స్టేట్ బోర్డు ఆఫ్ సెకండరీ అండ్ హయ్యర్ సెకండరీ సర్టిఫికెట్స్, ఢిల్లీ బోర్డు ఆఫ్ సెకండరీ, బుందేల్‌ఖండ్ యూనివర్సిటీలతో పాటు వివిధ యూనివర్సిటీలకు సంబంధించిన రికమండేషన్ లెటర్లు అవసరాలను బట్టి అందిస్తున్నారు. ఈ క్రమంలో హుస్సేనీఆలంకు చెందిన ఎండీ జుబేర్ అలీ, టోలీచౌకి ప్రాంతానికి చెందిన సయ్యద్ అతీఫుద్దీన్లు తమకు కావాల్సిన డిగ్రీ, ఇంటర్ సర్టిఫికెట్ల కోసం ఈ ముఠాను ఆశ్రయించి అడ్వాన్స్‌గా సగం డబ్బులు ఇచ్చారు. మిగతా డబ్బులు ఇచ్చి సర్టిఫికెట్లను తీసుకునేందుకు సోమవారం బాలాపూర్‌లోని కేక్ కింగ్ బేకరీ వద్దకు వచ్చారు. విశ్వసనీయ సమాచారంతో ఎల్బీనగర్ ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ సుధాకర్ బృందం, బాలాపూర్ పోలీసులతో కలిసి అక్కడ నిఘా ఉంచింది.
నకిలీ సర్టిఫికెట్ల ముఠా వాటిని అందించేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో దాడి చేసి పట్టుకున్నారు. ప్రధాన నిందితుడు ఖలీల్ మినహా తయారీదారులు, ఏజెంట్లు, రిసీవర్లను అరెస్ట్ చేశారు. ఈ ముఠా నుంచి పలు యూనివర్సిటీలు, బోర్డులకు సంబంధించిన నకిలీ సర్టిఫికెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సమావేశంలో ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్, రాచకొండ ఎస్ఓటీ డీసీపీ మురళీధర్ తదితర అధికారులు పాల్గొన్నారు.