ఉస్మానియా యూనివర్సిటీ, ఆగస్టు 22: రానున్న పాతికేళ్లలో విద్య, వ్యవసాయం, ఆర్థికం, సాంకేతిక రంగాల్లో భారతదేశం సూపర్ పవర్‌గా ఎదగాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి. వినోద్ కుమార్ ఆకాంక్షించారు. సంపన్న భారతదేశం మాత్రమే ప్రపంచాన్ని సానుకూలంగా ప్రభావితం చేయగలదని అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో స్వాతంత్య్ర వజ్రోత్సవాల ముగింపు వేడుకలను సోమవారం నిర్వహించారు.
ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా వినోద్ కుమార్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ విశిష్ట రాజ్యాంగంతో కూడిన నిజమైన ప్రజాస్వామ్యం మనదేశం సొంతమని అన్నారు. కొన్ని అభివృద్ధి చెందిన దేశాలకు భిన్నంగా మన రాజ్యాంగం పౌరులందరికీ ఓటు హక్కును కల్పించినదని గుర్తు చేశారు. 75 ఏళ్లలోనే భారతదేశం గొప్పగా అభివృద్ధి చెందేందుకు పునాది వేయడం లో కీలకపాత్ర పోషించిన నాటి నాయకులను కించపరచడం మానుకోవాలని ఆయన రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు.
నెహ్రూ, మహాత్మాగాంధీ వారసత్వాన్ని గుర్తు చేశా రు. నెహ్రూ ప్రతిపాదించిన విధానాలు, తీర్మానాలు దాని కాలానికి చాలా ముందున్నాయని ఎత్తి చూపారు. యువతరంతో కూడిన అపారమైన శక్తి సామర్థ్యం భారత్ సొంతమని, ఈ సందర్భంలో యువతను సరైన మార్గంలో నడిపించాల్సిన అవసరం ఉన్నదని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ప్రొఫెసర్ ఎన్జీ రాజుర్కర్, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, యూజీసీ డీన్ ప్రొఫెసర్ మల్లేశం పాల్గొన్నారు.