హిమాయత్‌నగర్, ఆగస్టు 22: సమాజానికి దివంగత మాజీ కొత్వాల్ రాజాబహదూర్ వెంకటరామ రెడ్డి అందించిన సేవలు నేటి తరానికి మార్గదర్శమని నగర పోలీస్ కమిషనర్ సీవీ. ఆనంద్ అన్నారు. రాజాబహదూర్ వెంకటరామ రెడ్డి ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో రాజా బహదూర్ వెంకటరామ రెడ్డి 153వ జయంతిని ఘనంగా నిర్వహించారు. సోమవారం నారాయణగూడ వైఎంసీఏ చౌరస్తాలోని కొత్వాల్ విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం సీవీ. ఆనంద్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాంతంలో విద్య అవకాశాలు లేని సమయంలో విద్యా సంస్థలు, వసతి గృహాలను స్థాపించి ఎంతో మందికి విద్యను అందించిన బహుముఖ ప్రజ్ఞాశాలి రాజా బహదూర్ వెంకటరామరెడ్డి అని కొనియాడారు. నగర కొత్వాల్‌గా బాధ్యతలు చేపట్టి ఏకదాటిగా 14 సంవత్సరాలు పనిచేసి నిజాం ప్రభుత్వం మన్నలను పొందారని గుర్తు చేశారు.
భాగ్యనగరం నడిబొడ్డున మహిళల కోసం ప్రత్యేకంగా కళాశాల, హాస్టల్‌ను ఏర్పాటు చేయడం గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు. రాజాబహదూర్ వెంకటరామ రెడ్డి స్ఫూర్తితో ముందుకు సాగి తెలంగాణను మరింత అభివృద్ధి చేసుకునేందుకు ప్రతిపౌరుడు కృషి చేయాలని పిలుపునిచ్చారు. విధి నిర్వహణలో ఉత్తమ సేవలందిస్తున్న హైదరాబాద్ సైబర్ క్రైం పోలీస్‌స్టేషన్ ఎస్సై యు.మదన్కుమార్గౌడ్, సైబరాబాద్, ఆమన్‌గల్ సర్కిల్ సీఐ జె.ఉపేందర్రావును వెంకటరామ రెడ్డి గోల్డ్ మెడల్స్‌తో సత్కరించి, ఐదువేల నగదు చెక్కును అందజేశారు.
ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు కొండా లక్ష్మీ కాంత్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి మట్టా రెడ్డి, ప్రతినిధులు కొండా రామచంద్రారెడ్డి, శ్రీధర్‌రెడ్డి, నారాయణగూడ పీఎస్ సీఐ రాపోల్ శ్రీనివాస్‌రెడ్డి, డీఐ రవికుమార్, ఎస్సైలు నాగరాజు, జ్యోతి, ప్రదీప్, నాగరాజు, నరేశ్, షఫీ, నారాయణగూడ ట్రాఫిక్ సీఐ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.