సిటీబ్యూరో, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): కూరగాయల మాటున గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్టుచేశారు. ఈ ముఠా నుంచి రూ.1.3 కోట్ల విలువైన 590 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ వివరాలు వెల్లడించారు. మహారాష్ట్రకు చెందిన కరన్ పరుశురామ్ పర్కాలే ఇంటర్ వరకు చదివి స్వస్థలంలో కొన్నాళ్లు వ్యవసాయం చేశాడు. సులభంగా డబ్బులు సంపాదించేందుకు అక్రమ దందాలు ప్రారంభించాడు.
ఆంధ్ర, ఒడిశా సరిహద్దు నుంచి 2019లో అక్రమంగా గంజాయి రవాణా చేయడం మొదలు పెట్టాడు. 2020లో ఆంధ్రప్రదేశ్ పోలీసులకు పట్టుబడి ఆరు నెలల పాటు వైజాగ్ జైలులో ఉన్నాడు. జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత తన వ్యాపారాన్ని విస్తరించాడు. ఒడిశాలోని మల్కన్‌గిరి ప్రాతానికి చెందిన గంజాయి విక్రయదారులు రాజు, భీమాలతో పరిచయం ఏర్పడింది. రూ.3వేలకు గంజాయి కొనుగోలుచేసి హైదరాబాద్‌తో పాటు వివిధ రూట్లలో మహారాష్ట్రకు తరలిస్తున్నాడు.
వాహనం కూరగాయలు రవాణా చేసేదిగా బయటకు కన్పించే విధంగా ఉంటుంది, లోపల గంజాయి ప్యాకెట్లను లోడ్ చేసుకొని స్మగ్లింగ్ చేస్తున్నాడు. ఇలా అక్రమంగా రవాణా చేసే సరకును మహారాష్ట్రలో కిలోకు రూ.15 వేల నుంచి రూ. 20 వేల వరకు విక్రయిస్తున్నాడు. ఒక సారి తెచ్చిన సరుకు విక్రయాలు పూర్తయిన తరువాత మరోసారి సరుకు కొనేందుకు ఒడిశా, ఆంధ్ర సరిహద్దు ప్రాంతాలకు వెళ్తాడు. ఒక్కోసారి ఒక్కో విక్రయదారుడి వద్దకు వెళ్తుంటాడు. ఈ క్రమంలోనే ఇటీవల తన ముఠా సభ్యులైన అజయ్ మహాదెవో ఎథెపి, సంతోష్ అనిల్ గైక్వాడ్, అకాశ్ శివాజీ చౌదరీలతో కలిసి 2 కార్లలో మల్కన్‌గిరి బయలుదేరారు.
సూర్యాపేటకు చేరుకోగానే గంజాయి తక్కువ ధరకు ఇప్పించే మీడియేటర్ భూక్య సాయికుమార్, అంబోతు నాగరాజులను తమ వెంట తీసుకువెళ్లారు. రూ.3 వేలకు కిలో గంజాయి ఇప్పిస్తే, ఒక్కో కిలోకు రూ.500 కమీషన్ ఒప్పందంతో ఆ ఇద్దరిని తమ వెంట తీసుకొని మల్కన్‌గిరి వెళ్లారు. అక్కడ రాజు, భీమా అనే వ్యక్తుల నుంచి రూ.3 వేలకు కిలో చొప్పున 590 కిలోల గంజాయి కొనుగోలు చేశారు. అంతా 104 ప్యాకెట్లలో నింపి వాటిని ఒక వ్యాన్‌లో లోడ్ చేశారు. బయటకు కూరగాయలు వేసుకొని తిరిగి మహారాష్ట్రకు హైదరాబాద్ మీదుగా వెళ్లేందుకు బయలుదేశారు.
ఆగస్టు 21వ తేదీన ఎల్బీనగర్ ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ ఎ.సుధాకర్ బృందం, అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులతో కలిసి పెద్ద అంబర్పేట్, ఓఆర్ఆర్ వద్ద వాహనాన్ని నిలిపి తనిఖీ చేయగా గంజాయి బయటపడింది. దీంతో వ్యాన్, దాని వెనుక కారులో వస్తున్న వారందరిని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం వెల్లడించారు.
దీంతో పరుశురామ్, అజయ్ మహాదేవ్, సంతోష్ అనిల్ గైక్వాడ్, అకాశ్లతో పాటు డ్రైవర్ వినోద్ గాడే, మధ్యవర్తి భూక్య సాయికుమార్‌లను అరెస్ట్ చేశారు. మరో మధ్యవర్తి నాగరాజుతో పాటు విక్రయిదారులు పరారీలో ఉన్నారు. గంజాయితో పాటు సరఫరాకు ఉపయోగించిన వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సమావేశంలో ఎస్ఓటీ డీసీపీ మురళీధర్, తదితర అధికారులు పాల్గొన్నారు.