సిటీబ్యూరో, ఆగస్టు 22(నమస్తే తెలంగాణ): గాంధీ దవాఖానలో మొట్ట మొదటిసారిగా వినికిడి సమస్యను అధిగమించే ‘కాక్లియర్ ఇంప్లాంట్’ శస్త్రచికిత్సను జరిపి మరో మైలురాయిని చేరుకున్నారు గాంధీ ఈఎన్టీ వైద్యులు. రూ.15 లక్షల ఖరీదైన ఈ శస్త్ర చికిత్సను పైసా ఖర్చు లేకుండా పూర్తి స్థాయిలో ఉచితంగా నిర్వహిస్తున్నట్లు దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాజారావు వెల్లడించారు. వివరాల్లోకి వెళితే, సిద్దిపేట జిల్లాకు చెందిన మోతికాని నవీన్, మమత దంపతుల కూతురు రుత్విక(3) పుట్టుకతోనే వినికిడి సమస్యతో బాధపడుతున్నది.
చికిత్స కోసం ప్రైవేటు దవాఖానలను ఆశ్రయిచంగా, రూ.15 లక్షల నుంచి రూ.18 లక్షల వరకు ఖర్చవుతున్నదని అక్కడి వైద్యులు తెలియజేశారు. దీంతో ఆర్ధిక స్థోమత లేని రుత్విక తల్లిదండ్రులు గాంధీ దవాఖానను ఆశ్రయించారు. ఈ మేరకు గాంధీ ఈఎన్టీ విభాగాధిపతి డాక్టర్ ఎ.శోభన్‌బాబు నేతృత్వంలో డాక్టర్ రత్న కుమారి, డా.విజయ కుమార్, అనస్థీషియా వైద్యులు డా.మురళీధర్, డా.గౌతమిలతో కూడిన బృందం చిన్నారికి సోమవారం కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్స జరిపినట్లు గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాజారావు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు, డీఎంఈ రమేశ్ రెడ్డిలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. చిన్నారికి సర్జరీ చేసిన వైద్య బృందాన్ని మంత్రి హరీశ్ రావు అభినందించినట్టు వారు తెలిపారు.
గాంధీ దవాఖానలో తొలిసారిగా మూడేళ్ళ చిన్నారికి కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్స జరిపిన వైద్య బృందాన్ని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్ రావు అభినందించారు. ప్రైవేటులో రూ.15 లక్షల వరకు ఖర్చయ్యే ఈ ఖరీదైన చికిత్సను సీఎం కేసీఆర్ మార్గనిర్దేశంలో ఉచితంగా అందుబాటులోకి తెచ్చినట్లు ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు.
ప్రస్తుత గాంధీ ఈఎన్టీ విభాగాధిపతి డాక్టర్ ఎ.శోభన్‌బాబు 2009లో కోఠిలోని ఈఎన్టీ దవాఖానలో తొలిసారిగా కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్ర చికిత్సలను ప్రారంభించారు. అప్పటి నుంచి రెండు తెలుగు రాష్ర్టాల్లోని ప్రభుత్వ రంగ దవాఖానాల్లో కేవలం కోఠి ఈఎన్టీ హాస్పిటల్లో మాత్రమే ఈ శస్త్ర చికిత్స అందుబాటులో ఉంది. దీని వల్ల నిరుపేదలు ఖరీదైన ఈ శస్త్రచికిత్సను చేయించుకునేందుకు నెలల తరబడి నిరీక్షించాల్సివచ్చేది.
చిన్నారుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ప్రత్యేక చొరవ తీసుకుని రూ.2.3 కోట్లతో గాంధీ దవాఖానలో కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సలకు అవసరమైన వసతులను కల్పించినట్లు దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు. సోమవారం నుంచి గాంధీలో కూడా కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలు ప్రారంభం కావడంతో, ఇప్పుడు రాష్ట్రంలో కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలు చేసే ప్రభుత్వ దవాఖానల సంఖ్య రెండుకు చేరడం నిరుపేద రోగులకు వరంగా మారింది.
డాక్టర్ శోభన్ బాబు, ఈఎన్టీ విభాగాధిపతి
రూ.12లక్షల ఖరీదైన కాక్లియర్ ఇంప్లాంట్‌ను తెలంగాణ సర్కార్ ఆరోగ్యశ్రీ ద్వారా పూర్తి ఉచితంగా రోగులకు అందజేస్తున్నదని ఈఎన్టీ విభాగాధిపతి డాక్టర్ శోభన్‌బాబు తెలిపారు. శస్త్ర చికిత్సతో కలిపి మొత్తం రూ.15 లక్షల వరకు ఖర్చవుతున్నదని, ఇంతటి ఖరీదైన కాక్లియర్ శస్త్ర చికిత్సలను తెలంగాణ ప్రభుత్వం మూడేళ్ళ వయస్సు లోపు చిన్నారులకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చేయిస్తున్నట్లు వివరించారు.
ఒక సర్జరీ చేయడానికి దాదాపు మూడు గంటలు పడుతున్నదని, రోజుకు రెండు సర్జరీలు చేసే వీలున్నట్లు ఆయన వివరించారు. శిశువుకు వినికిడి సమస్య ఉన్నదా? లేదా? అని తెలుసుకునేందుకు ‘ఆటో అకౌస్టిక్ ఎమిషన్’ అనే పరీక్ష చేయడం జరుగుతున్నదన్నారు. ఇక నుంచి గాంధీలో సైతం కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్ర చికిత్సలు జరపనున్నట్లు ఆయన వెల్లడించారు.