సిటీబ్యూరో, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ)/ చార్మినార్ :హైదరాబాద్ నగరాన్ని సిగ్నల్ ఫ్రీ నగరంగా మార్చేందుకు వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి ఫలాలు విడతల వారీగా ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి. ఇందులో భాగంగానే పాతనగరంలో మరో ఫ్లై ఓవర్ అందుబాటులోకి రానున్నది.
రూ.45 కోట్ల 79 లక్షల వ్యయంతో చాంద్రాయణగుట్ట ఫ్లై ఓవర్‌ను మంగళవారం పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభించనున్నారు. కాగా ఎస్ఆర్డీపీ ద్వారా నగరంలో నలువైపులా జీహెచ్ఎంసీ చేపట్టిన 41 పనుల్లో 30 పనులు పూర్తయ్యాయి. మిగతా 11 పనులు వివిధ అభివృద్ధి దశల్లో ఉన్నాయి. ఇప్పటి వరకు 15 ఫ్లై ఓవర్లు అందుబాటులోకి వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.
చాంద్రాయణగుట్ట, మహబూబ్‌నగర్ క్రాస్ రోడ్డు మార్గంలో 2007లో అందుబాటులోకి వచ్చిన ఈ ఫ్లై ఓవర్ నిర్మాణంతో కర్నూల్ రోడ్డు, మహబూబ్‌నగర్, ఫలక్‌నుమా, శ్రీశైలం రోడ్డు మార్గాల్లో ట్రాఫిక్ సమస్య తీరింది. కాలక్రమేణా కందికల్‌గేట్ నుంచి చాంద్రాయణగుట్ట మార్గంలోని బంగారు మైసమ్మ దేవాలయం వద్ద ట్రాఫిక్ భారీగా పెరిగిపోయింది.
దీంతో ప్రత్యామ్నయంగా ఫ్లై ఓవర్‌ను మరింత ముందుకు కొనసాగించేందుకు జీహెచ్ఎంసీ ప్రాజెక్ట్ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా సర్వే నిర్వహించి స్టాండింగ్ కమిటీకి అందించారు. స్టాండింగ్ కమిటీ నిర్ణయం మేరకు 674 మీటర్ల పొడవుతో ఫ్లై ఓవర్ అనుసంధాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ ఫ్లై ఓవర్‌ను 12 పిల్లర్లతో రెండు వైపుల 4 లేన్లు, 674 మీటర్ల పొడవుతో ఈ ఫ్లై ఓవర్‌ను
నిర్మించారు.
ఆరాంఘర్ నుంచి ఎల్బీనగర్ మీదుగా ఉప్పల్ వరకు ఏడు ఫ్లై ఓవర్లు, అండర్ పాసులు చేపట్టారు. ఆరాంఘర్ నుంచి మీర్‌అలం ట్యాంక్ వరకు నిర్మించే ఫ్లై ఓవర్ జీహెచ్ఎంసీలోనే అతి పొడవైనది. ఈ నిర్మాణ పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. ఫలక్‌నుమా ఫ్లై ఓవర్ త్వరలో అందుబాటులోకి రానున్నది. బైరమాల్గూడ కుడి, ఎడమ రెండు వైపులా, కామినేని హాస్పిటల్ వద్ద కుడి, ఎడమ రెండు వైపులా, ఎల్బీనగర్ వద్ద కుడి, ఎడమ వైపు అండర్ పాసులు అందుబాటులోకి రాగా నాగోల్ వద్ద కుడి, ఎడమ రెండు వైపులా చేపట్టిన నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆరాంఘర్ నుంచి ఉప్పల్ జంక్షన్ వరకు రవాణా మెరుగుపరచడమే కాకుండా ట్రాఫిక్ లేని రవాణా వ్యవస్థకు దోహద పడుతుంది.
చాంద్రాయణగుట్ట విస్తరణ ఫ్లై ఓవర్ అందుబాటులోకి వస్తే శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సులభంగా ఎల్బీనగర్ మీదుగా నల్గొండ, వరంగల్ వెళ్లేందుకు దోహదపడుతుంది. అంతేకాకుండా కందికల్ గేట్, బారాస్ జంక్షన్ల వద్ద వాహనాలు ఆగకుండా నేరుగా ఈ ఫ్లై ఓవర్ పైనుంచి వెళ్లవచ్చు.
ప్రస్తుతం ఉన్న ఫ్లై ఓవర్ అప్రోచ్ చివరలో ట్రాఫిక్ రద్దీని నివారించడానికి ఫ్లై ఓవర్‌ను పొడిగించినట్లు అధికారులు చెప్పారు. కుడి వైపున దర్గా, డీఎల్ఆర్ఎల్, ఎడమ వైపున మసీదు, గుడి ఉండటంతో ఇక్కడ అధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయని, ఫ్లై ఓవర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రమాదాలతోపాటు ట్రాఫిక్ సమస్య కూడా పరిష్కారం అవుతుందని పేర్కొన్నారు.