సిటీబ్యూరో, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ)/ మేడ్చల్ కలెక్టరేట్ : మైనారిటీ వర్గాల సంక్షేమ శాఖ కార్యాలయం ఆధ్వర్యంలో నడుస్తున్న రాష్ట్ర మైనారిటీ స్టడీ సర్కిల్ యూపీఎస్సీ సీశాట్-2023 పరీక్షలకు ఉచిత కోచింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేసింది. అందులో భాగంగానే జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో యూపీఎస్సీ ఉచిత కోచింగ్ కేంద్రంలో ప్రవేశాల కోసం సోమవారం నోటిఫికేషన్ జారీ చేశారు.
ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు ఖాసీ, నవీన్‌రెడ్డి తెలిపారు. అందుబాటులో ఉన్న స్టడీ సర్కిల్లో మహిళలకు 33 శాతం, దివ్యాంగులకు 3 శాతం ప్రాతిపదికన అడ్మిషన్లు చేపట్టనున్నామని పేర్కొన్నారు. ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షలో మెరిట్ సాధించాల్సి ఉంటుందని తెలిపారు. అలాగే, మైనారిటీ అభ్యర్థులకు చెందిన కుటుంబ వార్షిక ఆదాయం సంవత్సరానికి రూ.2 లక్షల మించకుండా ఉండాలని చెప్పారు.
ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, బౌద్ద, జైన్‌తో పాటు పార్సీ వంటి పలు రకాల కమ్యూనిటీకి చెందిన అభ్యర్థులు జనరల్ కోర్సులు, లేదా వృత్తి విద్యా కోర్సులు పూర్తి చేసి ఉన్న వారి నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతున్నారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవడానికి సెప్టెంబర్ 1 వరకు గడువు తేదీ నిర్ణయించారు. అర్హులైన అభ్యర్థులకు సెప్టెంబర్ 11 తేదీన ఉదయం 10 నుంచి మధ్యాహ్న 12 గంటల వరకు స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించనున్నారు.
తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాలల్లో, రాష్ట్రంలోని అన్ని జిల్లా ప్రధాన కేంద్రాల్లో నిర్వహించనున్నారు. అందులో భాగంగా హైదరాబాద్ జిల్లాలో కూడా స్క్రీనింగ్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు జిల్లా అధికారి పేర్కొన్నారు. ఆన్లైన్ దరఖాస్తుల కోసం www.tmreis.telangana.gov.in వెబ్సైట్లో పొందుపరిచామని, పూర్తి స్థాయి నోటిఫికేషన్ కోసం వెబ్‌సైట్‌ను లాగిన్ కావాలన్నారు. నాంపల్లిలోని హజ్ హౌస్ 6వ అంతస్తులో ఉన్న తమ కార్యాలయంలో గానీ, 040-23240134లో సంప్రదించాలన్నారు.