బడంగ్‌పేట, ఆగస్టు 22: తెలుగు సాహిత్యం ఉన్నంతకాలం కవి వానమామలై కూడా జీవించే ఉంటారని రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ కప్పాటి పాండురంగారెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో మహాకవి డాక్టర్ వానమామలై వరదాచార్య సాహితీ పురస్కారాన్ని అందుకోనున్న రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ఆయాచితం శ్రీధర్ని సోమవారం పాండురంగారెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి పూలగుచ్ఛం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కవి వానమామలై తన కలంతో ఆయన సృష్టించిన రసరమ్య కావ్యాలు చిరస్థాయిగా భావితరాలవారికి నిత్యం గుబాళింపులను అందిస్తాయన్నారు. తెలంగాణాలో కవులు లేరన్న వాదనను తొలగించి విశ్వనాథవంటి మహాకవులే కీర్తించబడ్డ మహాకవీశ్వరుడు, సాహితీ దురంధరుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. తన జీవితాన్ని అభ్యుదయ రచనలకై అంకితం చేసిన మహానుభావుడు వానమామలై అన్నారు. పండితులతో పాటు పామరులను అలరింపచేసిన ప్రాజ్ఞుడు, తెలుగు జాతి గర్వించదగిన ఉత్తమ కవిసార్వభౌముడు మన వానమామలై అని తెలిపారు.
కాలం, వెలుగు ఉన్నంతకాలం వానమామలై సాహిత్య పరిమళాలు గుబాలిస్తూనే ఉంటాయన్నారు. అలాంటి కీర్తి పతాక వానమామలై వరదాచార్యుల పురస్కారం ఆయాచితం శ్రీధర్ పొందనుండడం గర్వకారణం అన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్, జనగామ, సూర్యపేట, భూపాలపల్లి, నల్గొండ, హైదరాబాద్, నారాయణ ఖేడ్ జిల్లాల గ్రంథాలయ చైర్మన్లు వినయ్, కృష్ణారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, రాజేశ్, భద్రాద్రి, ప్రసన్న రామమూర్తి, రామకృష్ణ, హనుమకొండ జిల్లా మాదారం మండల సొసైటీ చైర్మన్ లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు.