అంబర్‌పేట, ఫిబ్రవరి 25 : బాగ్‌అంబర్‌పేట డివిజన్ వైభవ్‌నగర్ కాలనీ వరదముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చేపట్టాలని, అందుకోసం బతుకమ్మకుంట నుంచి కాలా బ్రిడ్జి వరకు బాక్స్ డ్రెయిన్‌ను నిర్మించాలని జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులకు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ చెప్పారు. సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, ఇతర జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులతో కలిసి వైభవ్నగర్లోని సీజన్స్ దవాఖాన లేన్‌లో శుక్రవారం ఎమ్మెల్యే పాదయాత్ర నిర్వహించి అక్కడి ఓపెన్ నాలాను పరిశీలించారు. ఈ సందర్భంగా సీజన్స్ హాస్సిటల్ను ఆనుకొని ఉన్న 400 మీటర్ల ఓపెన్ నాలాలో వరదనీరు, డ్రైనేజీ కలిసి రోడ్లు, పక్కనే ఉన్న ఇండ్లలోకి చేరుతున్నదని అధికారుల దృష్టికి తెచ్చారు. దీంతో ఇండ్లలోకి చెత్తాచెదారం రావడం, దోమల బెడదతో అనారోగ్యం పాలై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా బాక్స్ డ్రెయిన్ నిర్మాణం చేపట్టాలని అధికారులకు ఎమ్మెల్యే చెప్పారు. అలాగే డ్రైనేజీ నీరు పోవడానికి ప్రత్యేకంగా డ్రైనేజీ పైపులైన్ కూడా వేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ డీసీ వేణుగోపాల్, ఈఈ శంకర్, డీఈ సుధాకర్, వాటర్‌వర్క్స్ డీజీఎం సతీశ్, ఏఈ మాజిద్, ప్రాజెక్టు డీఈ రేణుక, ఏఈ ప్రశాంత్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు దిలీప్, గణేశ్, నర్సింగ్, శంకర్, నవీన్‌యాదవ్, రవి, టిల్లు, గౌస్ తదితరులు పాల్గొన్నారు.