అంబర్‌పేట, ఆగస్టు 22: ఆడపిల్లల పెళ్లి చేసేందుకు షాదీముబారక్, కల్యాణలక్ష్మి కింద లక్షా నూటపదహారు రూపాయలు అందజేస్తున్న సీఎం కేసీఆర్ ఆడపడచుల పెద్దన్న అని అంబర్‌పేట ఎమ్మెల్యే కొనియాడారు. హిమాయత్‌నగర్ మండల పరిధిలోకి వచ్చే అంబర్‌పేట నియోజకవర్గం లబ్ధిదారులు 56 మందికి ఒక్కొక్కరికి లక్షా నూట పదహారు చొప్పున రూ.56,06,496ల షాదీముబారక్ చెక్కులను తహసీల్దార్ సీహెచ్ చంద్రకళతో కలిసి ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ సోమవారం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏ దేశంలో లేనివిధంగా ఆడ పిల్లల పెళ్లిళ్లకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాన్ని తెలంగాణలో మాత్రమే అమలు చేస్తున్నారని చెప్పారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకం అందుతున్నదని పేర్కొన్నారు. ఇటీవలనే అంబర్‌పేట మండల పరిధిలో నివాసముంటున్న 90 మందికి కల్యాణలక్ష్మి చెక్కులు అందజేయడం జరిగిందన్నారు.
సంక్షేమ, అభివృద్ధి పథకాలను పకడ్బందిగా అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కొనియాడారు. ఇదే సమయంలో షాదీముబారక్ అందుకున్న ఓ ముస్లిం మహిళ ఆనందంతో ‘సీఎం కేసీఆర్ అచ్చా రహే’ అంటూ దువా చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ రిఘువిష్ణు, స్పెషల్ ఆర్ఐలు జగదీశ్వర్‌రావు, మధు తదితరులు పాల్గొన్నారు.