మెహిదీపట్నం, ఆగస్టు 22 : ప్రజలకు అభివృద్ధిని అందించి, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రజాప్రతినిధులు కృషి చేయాలని ఎంఐఎం శాసనసభా పక్షనేత, చాంద్రాయణ గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. సోమవారం నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్‌మెరాజ్ హుస్సేన్, అక్బరుద్దీన్ ఒవైసీని కలిసి నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి పనులు, సమస్యలు వివరించారు. స్పందించిన అక్బరుద్దీన్ ప్రజలకు అం దుబాటులో ఉండాలని ప్రజాప్రతినిధులకు సూచించారు.
కార్వాన్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులను చేపడుతున్నామని ఎమ్మెల్యే కౌసర్ మొహినుద్దీన్ అన్నారు. టోలిచౌకిలో ఎమ్మెల్యే జీహెచ్ఎంసీ డిప్యూటీ ఈఈ రామకృష్ణ, ఏఈ కలీముద్దీన్లతో కలిసి ఎన్పీ – 3 పైపులైన్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో నానల్‌నగర్ కార్పొరేటర్ ఎండీ.నసీరుద్దీన్, ఎంఐఎం కార్పొరేటర్ల ప్రతినిధులు మహ్మద్ హరూన్ ఫర్హాన్, బద్రుద్దీన్ పాల్గొన్నారు.
కార్వాన్ నియోజకవర్గం లంగర్‌హౌస్ డివిజన్ బాపూఘాట్లో సోమవారం పారిశుధ్య విభాగం అధికారులు పరిశుభ్రత పనులను చేపట్టారు. ఇటీవల మూసీ ప్రవాహం కారణంగా బాపూఘాట్ వద్ద చెత్తాచెదారం పేరుకుపోయి అపరిశుభ్రంగా మారింది. దీంతో సోమవారం జీహెచ్ఎంసీ పారిశుధ్య విభాగం అధికారులు ఆయా ప్రదేశాలను పరిశీలించి సిబ్బందితో పేరుకుపోయిన మట్టిని తొలగింప చేశారు.
కార్వాన్ నియోజకవర్గం నానల్‌నగర్ డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రణాళికలు రూపొందించాలని కార్పొరేటర్ ఎండీ.నసీరుద్దీన్ అన్నారు. సోమవారం నానల్‌నగర్ జీహెచ్ఎంసీ వార్డు కార్యాలయంలో డిప్యూటీ ఈఈ రామకృష్ణతో కార్పొరేటర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికంగా నెలకొన్న సమస్యల పరిష్కరంపై చర్చించారు.