చాంద్రాయణగుట్ట, ఆగస్టు 21 : దోమల నియంత్రణే లక్ష్యంగా మున్సిపల్ విభాగం మలేరియా అధికారులు ఒకే ఎంటామాలజీ.. ఒకే కాలనీ ప్రయోగంతో ముందుకు వెళ్తున్నారు. దక్షిణ మండలం చార్మినార్ జోన్ పరిధిలో మొత్తం 897 మంది సిబ్బంది పని చేస్తున్నారు. వీరిలో ఒక్కొక్కరు ప్రతిరోజు 149 కాలనీలను ఎంపిక చేసుకొని అవగాహన కల్పిస్తున్నారు. వారం తర్వాత మరోసారి 149 కాలనీల్లో విధులకు హాజరవుతున్నారు.యాంటీ లార్వాల్ ఆపరేషన్ టీంలో 342 మంది సిబ్బంది పని చేస్తున్నారు. ఒక్కొక్కరూ వారంలో మూడు కాలనీలు అవగాహన కల్పించేలా.. ప్రయోగం చేపట్టారు. వీరితో పాటు ఫాగింగ్ టీం క్రమం తప్పకుండా పని చేస్తుంది. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల 10 నిమిషాలకు అధికారులు, సిబ్బంది స్టికర్స్, కరపత్రాలు, బ్యానర్ల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. రేడియో, మైక్ ద్వారా శ్రోతలకు అర్థమైయ్యేలా లోతట్టు, సమస్యాత్మక ప్రదేశాల్లో పాటించాల్సిన సత్వర చర్యలు తెలుపుతున్నారు.
మలేరియా సిబ్బంది రక్షణకు ప్రత్యేక కిట్ ..
తెలంగాణ సర్కార్ మలేరియా సిబ్బంది ఇబ్బందులు పడకుండా రక్షణ కిట్లను ఇస్తున్నది. పూలకుండీలు, నీటిని నిల్వ చేసిన డబ్బాలు, టైర్లు, పాత వస్తువులు తీసి వేస్తున్నారు. రసాయనాలు, ఫాగింగ్, ఐ మెటీరియల్, ఆయిల్ బాక్స్, చెప్పులు, నోట్‌బుక్స్, జాకెట్స్, రెయిన్‌కోట్స్, సబ్బులు, ఆయిల్ డబ్బాలు, బ్లేడ్స్, శానిటైజర్లు, మాస్కులు, గ్లౌజులు ఇస్తున్నారు.
లార్వా వృద్ధి చెందకుండా రసాయనాలు పిచికారీ
లార్వా వృద్ధి చెందకుండా రసాయనాలు పిచికారీ చేయిస్తున్నాం. ఆట స్థలాలు, ప్రార్థనా మందిరాలు, ప్రభు త్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు, నాలాకు ఇరువైపులా పరిసరాలు శుభ్రంగా ఉండేలా సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి ఇంట్లో ఓ వ్యక్తికి అవగాహన కల్పిస్తూనే.. భాగ్యస్వాములు అయ్యేలా కార్యక్రమాలు చేపడుతున్నాం. బ్యానర్లు ప్రదర్శిస్తూ.. ర్యాలీలు నిర్వహిస్తూ బస్తీల వాసుల్లో చైతన్యం తీసుకువస్తున్నాం. పరిశుభ్రత పాటిస్తే మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా రాకుండా ఉంటుంది.
– నామాల శ్రీనివాస్ , సీనియర్ ఎంటామాలజిస్టు ,చార్మినార్ జోన్ మున్సిపల్ కార్యాలయం