సిటీబ్యూరో, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): బిల్కిస్ బానో జీవితాన్ని ఛిద్రం చేసిన దోషులకు క్షమాభిక్ష పెడతారా.? ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడే ‘నారీశక్తి’ అంటే మహిళా హక్కులను కాలరాయడమేనా.? క్షమాభిక్ష రద్దుచేసి వారిని తిరిగి జైలుకు పంపాల్సిందే.. అంటూ ఎల్ఐసీ మహిళా ఉద్యోగులు డిమాండ్ చేశారు. శుక్రవారం ఎల్ఐసీ హైదరాబాద్ డివిజనల్ కార్యాలయంలో ఐసీఈయూ హైదరాబాద్ డివిజన్ జనరల్ సెక్రటరీ తిరుపతయ్య ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులు సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ (ఐసీఈయూ) వర్కింగ్ ఉమెన్ వింగ్ కమిటీ కన్వీనర్ వి.మైథిలి మాట్లాడుతూ.. గోద్రా ఘర్షణల్లో బిల్కిన్ బానో కుటుంబాన్ని క్రూరంగా చంపి, సామూహిక లైంగికదాడి చేసిన కేసులో శిక్ష అనుభవిస్తున్న దోషులను సత్ప్రవర్తన కింద విడుదల చేయడం ఎంతమాత్రం సమర్థనీయం కాదని పేర్కొన్నారు. లైంగికదాడి, హత్యలకు పాల్పడిన వారికి క్షమాభిక్ష పెట్టడం అంటే వాటిని గుజరాత్ ప్రభుత్వం సమర్థించడమే అవుతుందని ఆరోపించారు. స్వాతంత్య్ర దినాన ఎర్రకోటపై జాతీయ జెండా సాక్షిగా మహిళలను గౌరవించాలంటూ ప్రధాని పలికిన మాటలు శుష్క విధానానికి తార్కాణమని పేర్కొన్నారు. బాధితురాలి వేదనకు, ఆమె చేసిన న్యాయపోరాటాలకు కేంద్రం, ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఏం సమాధానం చెబుతాయని ప్రశ్నించారు.
ఈ చర్యలు, ఆయా ప్రభుత్వాలతో పాటు న్యాయవ్యవస్థపై నమ్మకం కోల్పోయే విధంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ బాధితురాలికి న్యాయం అమలు చేయడంలో గుజరాత్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, భవిష్యత్తులో మహిళలపై దాడులు పెరిగే అవకాశం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. బాధితురాలు కోరినట్టు ఆమెకు రక్షణ కల్పించడంతో పాటు దోషులు వెంటనే శిక్ష అనుభవించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జోనల్ ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఉపాధ్యక్షురాలు సుజాత, ఐసీఈయూ ఉపాధ్యక్షురాలు విజయలక్ష్మి, కో కన్వీనర్లు సరస్వతి, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.