సిటీబ్యూరో, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): నిర్మాణ రంగ అనుమతుల ప్రక్రియలో అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేసే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన టీఎస్ బీపాస్కు విశేష ఆదరణ లభిస్తున్నది. నిర్మాణ రంగానికి సంబంధించి ఇలా దరఖాస్తు చేసుకున్న వెంటనే అలా అనుమతులు వస్తుండటంతో ఇండ్ల నిర్మాణాల జోరు పెరిగింది. ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో కొత్త నిర్మాణాల కళ సంతరించుకుంటున్నది. శివార్లలోనే ఖాళీ స్థలాలు అధికంగా ఉండటం, అపార్ట్మెంట్లలో ఉండి విసిగిపోయిన వారంతా శివార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. మరికొందరైతే గతంలోనే తీసిపెట్టుకున్న స్థలాల్లో కొత్తగా తమ అభిరుచులకు అనుగుణంగా సొంత ఇండ్లను నిర్మించుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఫిబ్రవరి 2020 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు టీఎస్ బీ పాస్ ద్వారా జీహెచ్ఎంసీ పరిధిలో 28757 నిర్మాణాలను అనుమతులు ఇవ్వగా, హెచ్ఎండీఏ పరిధిలో 41643 నిర్మాణాలకు అనుమతులు ఇచ్చినట్లు ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో అధికారులు పేర్కొన్నారు.
ఇన్స్టాంట్ అప్రూవల్స్ అత్యధికం..
ప్రధానంగా 76 నుంచి 600 చదరపు గజాల వరకు స్థలంలో 10 మీటర్ల ఎత్తు వరకు నిర్మించే నివాస భవనాలకు స్వీయ ధ్రువీకరణతో అనుమతులు పొందుతున్నారు. స్థలానికి సంబంధించి డాక్యుమెంట్లు, భవనం ప్లాన్ తదితర వివరాలతో ఆన్లైన్లో దరఖాస్తు చేసిన వెంటనే వీరికి ఆమోదం (ఇన్స్టంట్ అఫ్రూవల్) లభిస్తుంది. ఇలా స్వీయ ధ్రువీకరణ ద్వారా అనుమతి పొందిన స్థలాలను పరిశీలించేందుకు జోనల్ స్థాయిలో ప్రత్యేకంగా నియమించిన టాస్క్ఫోర్స్ కమిటీ పోస్ట్ వెరిఫికేషన్ జరుపుతున్నది. 21 రోజుల వ్యవధిలోనే అనుమతులు లభిస్తుండటం గమనార్హం.
టీఎస్ బీ పాస్ ప్రయోజనాలు/నిబంధనలు