సిటీబ్యూరో, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్లో చారిత్రక దిగుడు బావులు పూర్వ వైభవాన్ని సంతరించుకుంటున్నాయి. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ శాఖలు స్వచ్ఛంద సంస్థలతో కలిసి చారిత్రక మెట్ల (దిగుడు) బావులను శుభ్రం చేసి, పునరుద్ధరిస్తున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 44 చోట్ల దిగుడు బావులను పునరుద్ధరించే ప్రణాళికలు సిద్ధం చేసిన అధికారులు ఈ మేరకు ఇప్పటికే ఆరు చోట్ల పూర్వ వైభవాన్ని మళ్లీ ఎలుగెత్తి చాటారు. బాపుఘాట్, గచ్చిబౌలి, గుడి మల్కాపూర్, శివంబాగ్, బన్సీలాల్‌పేట, సీతారాంబాగ్‌లో పరిరక్షణ చర్యలు చేపట్టారు.
మరో 34 చోట్ల బావుల పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ఆగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ ఆధ్వర్యంలో ఆరు పురాతన బావులను పునరుద్ధరించినట్లు ఆదివారం ట్విట్టర్ వేదికగా పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్ తెలిపారు. బడి, హమామ్, బాగ్, వెస్ట్ర న్, ఈద్గా, ఈస్ట్రన్ చారిత్రాత్మక బావుల పునరుద్ధరణ పనులు చేపట్టామని పేర్కొన్నారు.
కుతుబ్ షాహీ హెరిటేజ్ పార్కులోని వ్యర్థాలతో పాటు ఆరు బావుల నుంచి దాదాపు 19.3 మిలియన్ లీటర్ల వ్యర్థాలను తొలగించినట్లు ఆయన తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 18 బావులను పూర్వవైభవంలోకి తీసుకువచ్చినట్లు అర్వింద్‌కుమార్ పేర్కొన్నారు. చారిత్రక కట్టడాల సంరక్షణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని ఆయన చెప్పారు. వారసత్వ కట్టడాల సంరక్షణ, పునరుద్ధరణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, వారసత్వ సంపదను కాపాడుకోవడానికి ఈ కార్యక్రమం భావితరాలకు దోహదం చేస్తుందని ఈ సందర్భంగా అర్వింద్‌కుమార్ పేర్కొన్నారు.