సిటీబ్యూరో, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్) సేవలు ప్రజలకు మరింత చేరువ కానున్నాయి. ప్రస్తుతం 1480 పడకల సామర్థ్యమున్న ఈ దవాఖానలో ప్రతి నిత్యం 2000 నుంచి 3000 వరకు రోగులు ఓపీ సేవలు పొందుతున్నారు. సుమారు 1500కు పైగా ఐపీ రోగులు ప్రతినిత్యం చికిత్స పొందుతుంటారు. డిశ్చార్జ్ కంటే అడ్మిట్ అయ్యేవారి సంఖ్య అధికంగా ఉండడంతో నిమ్స్‌లో బెడ్స్ లభించడం కష్టంగా మారుతున్నది. దీంతో ప్రతినిత్యం రోగులు అవస్థలకు గురవుతున్నారు. ఇది గమనించిన సీఎం కేసీఆర్.. నిమ్స్ సామర్థ్యాన్ని పెంచి వైద్యసేవలను మరింత విస్తరించేందుకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా 2000 పడకలతో నూతన భవనాన్ని నిర్మించాలని గతంలోనే అధికారులను ఆదేశించారు.
ఈ నెల 1న స్థలం స్వాధీనం
అత్యంత ఖరీదైన ఎర్రమంజిల్ స్థలాన్ని ఈనెల 1న నిమ్స్ అధికారులు స్వాధీనం చేసుకోవడంతో నూతన భవన నిర్మాణానికి మార్గం సుగమం అయ్యింది. దవాఖానలో ఇటీవల చిన్నపిల్లల గుండె శస్త్రచికిత్సల విభాగాన్ని ప్రారంభించిన సమయంలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు నిమ్స్ నూతన భవన నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. ఇందులో భాగంగానే నిమ్స్ భవన నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని కేటాయించడంలో మంత్రి చొరవ చూపించడంతో వైద్యశాల అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
త్వరలోనే నిర్మాణ పనులు
నిమ్స్‌కు స్థలాన్ని కేటాయించడంతో త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఎర్రమంజిల్ కాలనీలో ఉన్న భవనాలను కూల్చివేసి నిర్మాణ పనులు చేపట్టేందుకు కసరత్తు మొదలు పెట్టారు. 2వేల పడకలతో నిమ్స్‌కు అనుబంధంగా సూపర్ స్పెషాలిటీ దవాఖానతో పాటు 200 పడకలతో మాతా శిశు కేంద్రాన్ని సైతం నిర్మించనున్నట్లు అధికారులు వివరించారు. నూతన భవనం అందుబాటులోకి వస్తే నిమ్స్ సామర్థ్యం 3480కు చేరుకుంటుందని, దీని వల్ల భవిష్యత్‌లో కూడా పడకల కొరత ఏర్పడకుండా రోగులకు మరింత వైద్యసేవలు అందుతాయని తెలిపారు.
32.16 ఎకరాలు ..
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నిమ్స్‌కు ఆనుకొని ఉన్న ఎర్రమంజిల్ కాలనీలోని 32 ఎకరాల 16గుంటల స్థలాన్ని ఆర్ అండ్‌బీ అధికారులు నిమ్స్‌కు అప్పగిస్తూ.. ఉత్తర్వులు జారీ చేశారు. ఈ స్థలం విలువ సుమారు రూ. 3,200 కోట్లు ఉంటుందని అధికారుల అంచనా.