అంబర్‌పేట, ఆగస్టు 2 : దళితబంధును అందరు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. దళితబంధు పొందిన లబ్ధిదారుల జీవితాల్లో వెలుగులు కనిపించాలన్నారు. నల్లకుంట డివిజన్ గోల్నాక మార్కెట్ అంబేద్కర్‌నగర్ నివాసి శివశేఖర్కు దళితబంధు పథకం కింద మంజూరైన కారు తాళం చెవులను మంగళవారం ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దశాబ్దాల కాలంగా వెనుకబడిన దళితుల జీవితాల్లో మార్పులు తీసుకురావాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారని చెప్పారు. ప్రతి నియోజకవర్గానికి 1500 యూనిట్లకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ త్వరలోనే ప్రారంభమవుతుందన్నారు.
వచ్చే ఎనిమిదేండ్లలో రూ. 17 లక్షల కుటుంబాలలో వెలుగులు నింపేందుకు సీఎం ప్రణాళిక లు రూపొందించారని పేర్కొన్నారు. దళితబంధు పథకాన్ని సీఎం కేసీఆర్ ఒక యజ్ఞంలా అమలు చేస్తున్నారని వెల్లడించారు. తెలంగాణలో తప్పా ఈ పథకం దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేదన్నారు. సీపీఐ రాష్ట్ర నాయకుడు పి. గెల్వయ్య, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు బి. దీపక్‌కుమార్, పార్టీ డివిజన్ అధ్యక్షుడు మేడి ప్రసాద్, సీనియర్ నాయకులు ఆర్. రాము, గాలిపల్లి శంకర్, ధనుంజయ, గాజుల గోపాల్ పాల్గొన్నారు.
ఆత్మరక్షణ కోసం కరాటే నేర్చుకోవాలి..
కాచిగూడ : ఆత్మరక్షణకు కరాటే ఓ ఆయుధంలా పనిచేస్తుందని, బాలికలు కరాటేను నేర్చుకోవడానికి ధైర్యంగా ముందుకు రావాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. యమగూచి కరాటే అకాడమీ ఆధ్వర్యంలో మంగళవారం కరాటే పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు నారాయణగూడ వైఎంసీఏలో ట్రోఫీని ఎమ్మెల్యే అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. చదువుతో పాటు ఆడపిల్లలు కరాటే నేర్చుకోవడం ఎంతో అవసరమని, కరాటే శిక్షణ పొందితే ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. తల్లిదండ్రులు ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. వినయ్ స్వరూప్, ఆర్.కె కృష్ణ పాల్గొన్నారు.