Younger Skin | వయసు పైబడే కొద్దీ వృద్ధాప్యం రావడం సహజం. వృద్ధాప్యం కారణంగా శరీరంలో ఇతర అవయవాల పనితీరు తగ్గినట్టుగానే చర్మం కూడా వృద్దాప్య లక్షణాలను చూపిస్తుంది. చర్మం ముడతలు పడడం, చర్మం వదులుగా అవ్వడం, స్థిరత్వాన్ని కోల్పోవడం వంటివి జరుగుతూనే ఉంటాయి. చాలా మంది చర్మం చూపించే ఈ వృద్దాప్య లక్షణాలను నివారించడానికి మేకప్ వేసుకోవడంతో పాటు చర్మం బిగుతుగా అవ్వడానికి శస్త్ర చికిత్సలు వంటివి కూడా చేయించుకుంటారు. అయితే ఇవన్నీ అవసరం లేకుండా మన రోజువారీ అలవాట్ల ద్వారా కూడా చర్మాన్ని ఎక్కువ కాలం యవ్వనంగా, శక్తివంతంగా ఉండేలా చేసుకోవచ్చు. జీవనశైలిలో మార్పులు చేసుకోవడం వల్ల చర్మాన్ని, శరీరాన్ని సహజంగా అందంగా, యవ్వనంగా మార్చుకోవచ్చు. చర్మం ఎక్కువకాలం పాటు యవ్వనంగా ఉండడానికి జీవనశైలిలో ఎటువంటి మార్పులు చేసుకోవాలో.. తెలుసుకుందాం.
రోజూ తగినంత నిద్రించాలి. నిద్రించడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. దీంతో కణాల మరమ్మత్తు జరుగుతుంది. దీంతో వృద్దాప్యం నెమ్మదిస్తుంది. కనుక రోజూ 7 నుండి 8 గంటల పాటు నిద్రించడం చాలా అవసరం. అలాగే పండ్లు, కూరగాయలు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండే ఆహారాలను తీసుకోవాలి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మ స్థితిస్థాపకతను, కణాల మరమ్మత్తును ప్రోత్సహిస్తాయి. దీంతో వృద్దాప్యం త్వరగా రాకుండా ఉంటుంది. క్రమం తప్పకుండా రోజూ వ్యాయామం చేయాలి. ఇలా చేయడం వల్ల రక్తప్రసరణ పెరుగుతుంది. శరీరం శక్తి కూడా పెరుగుతుంది. రక్తప్రసరణ పెరగడం వల్ల చర్మానికి పోషకాలు ఎక్కువగా అందుతాయి. దీంతో చర్మ ఆరోగ్యం, అందం రెండూ పెరుగుతాయి.
అదే విధంగా వృద్దాప్యం త్వరగా రాకుండా ఉండాలంటే ఒత్తిడి తగ్గించుకోవాలి. యోగా, ధ్యానం వంటివి చేయడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ ఉత్పత్తి తగ్గుతుంది. ఇది చర్మానికి, శరీర ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. సూర్యుడి నుండి వచ్చే యూవీ కిరణాలు చర్మంపై నేరుగా పడడం వల్ల నల్ల మచ్చలు, ముడతలు రావడంతో పాటు దీర్ఘకాలిక చర్మ నష్టం కలుగుతుంది. కనుక చర్మంపై నేరుగా సూర్యుడి కిరణాలు పడకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఈ విధంగా మన జీవనశైలిలో మార్పులు చేసుకోవడం వల్ల సహజంగానే చర్మం వృద్దాప్య ఛాయలను తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. జీవన శైలిలో వచ్చే ఈ మార్పులు చర్మానికే కాకుండా మొత్తం ఆరోగ్యానికి కూడా మేలు కలిగేలా చేస్తాయని నిపుణులు తెలియజేస్తున్నారు.