బేగంపేట్/కేపీహెచ్‌బీ కాలనీ, జూలై 31: లార్వా దశలోనే దోమల నియంత్రణకు చర్యలు చేపడుతున్నామని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాలు.. 10 వారాలపాటు పరిశుభ్రత కార్యక్రమాన్ని కూకట్పల్లి సర్కిల్లోని ఓల్డ్ బోయిన్‌పల్లిలో మంత్రి మల్లారెడ్డి నివాసంలో మంత్రిమల్లారెడ్డి, వెస్ట్ మారేడ్‌పల్లిలోని తన ఇంటి వద్ద మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వయంగా వారి వారి ఇండ్లల్లో ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలను పరిశీలించి, నీటిలో దోమలు వృద్ధి చెందే విధానాన్ని అధికారులు వివరించారు. ఇంటి ఆవరణలోని ఖాళీగా ఉన్న నీటి తొట్లలో పేరుకు పోయిన మురికి నీటి వారు తొలగించారు. అందేవింగా ఇంట్లో పాత టైర్లలో నీటి ఆవాసాలను గుర్తించి రసాయనాలను పిచికారీ చేయించారు.
ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డితో పాటు జోనల్ కమిషనర్ వి.మమత, సర్కిల్ ఉప కమిషనర్ పి.రవీందర్‌కుమార్, ఎంటమాలజీ సీనియర్ అసిస్టెంట్ లచ్చిరెడ్డి పాల్గొన్నారు. అనంతరం మంత్రులు మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉదయం 10 గంటలకు 10 నిమిషాలు పరిశుభ్రత కార్యక్రమంపై అవగాహన కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేస్తుందన్నారు. సీజనల్ వ్యాధులను అరికట్టే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. ప్రభుత్వ వైద్యశాలలను బలోపేతం చేస్తూ సకల సదుపాయాలను కల్పిస్తుందని.. అధునాతన వసతులతో కూడిన కొత్త వైద్యశాలలను, పట్టణాల్లో బస్తీ దవాఖానలను అందుబాటులోకి తెచ్చిందన్నారు. ప్రజలు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. కార్యక్రమంలో సీనియర్ ఎంటమాలజిస్ట్ దుర్గా ప్రసాద్, శ్రీనివాస్‌రెడ్డి, సత్యనారాయణ, స్థానిక నేతలు పాల్గొన్నారు.