బంజారాహిల్స్, జూలై 30: పూర్వ విద్యార్థులే విశ్వవిద్యాలయం, సమాజానికి మధ్య అనుసంధానకర్తలని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ కె.సీతా రామారావు అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేదర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో పూర్వ విద్యార్థుల సంఘం (ఏఏఏఓయూ) నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఎస్.వెంకటేశ్వరరావు, డాక్టర్ డి.ఉదయని, ఉపాధ్యక్షులుగా సాజిదా ఖాన్, సంయుక్త కార్యదర్శిగా ఎన్.యాదగిరి, కోశాధికారిగా ఎన్సీ వేణు గోపాల్, కార్యనిర్వాహక సభ్యులుగా డాక్టర్ కె.చంద్రకళ, ఎండి హబీబుద్దీన్, ఎం.రుష్యేంద్రమణి, కె.మంజుల, వి.చంద్ర కుమార్, ఎండి హంజా అలీలను వీసీ ప్రొఫెసర్ సీతారామారావు పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్నేండ్లుగా విశ్వవిద్యాలయంలో పూర్వ విద్యార్థుల సంఘం ఉన్నప్పటికీ ప్రస్తుత సభ్యులు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడం, బైలాస్ రూపొందించుకోవడం, అడహాక్ కమిటీని ఎన్నుకోవడం శుభ సూచికమన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్, డాక్టర్ ఏవీఎన్ రెడ్డి, డైరెక్టర్ ఫ్రొఫెసర్ పి.మధుసూదన్‌రెడ్డి, ప్రజా సంబంధాల అధికారి డాక్టర్ పి.వేణు గోపాల్ రెడ్డి, నోడల్ అధికారి డాక్టర్ పల్లవి కబ్డే పాల్గొన్నారు.