సిటీబ్యూరో,జూలై 27 (నమస్తేతెలంగాణ): గ్రేటర్ చుట్టూ గుబురు పొదలు, చెత్తాచెదారంతో వృధాగా ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాలు ఇకనుంచి ప్రకృతి రమణీయతను పంచనున్నాయి. అటవీ ప్రాంతాలన్నీ అర్బన్ లంగ్స్పేస్లుగా మారుతున్నాయి.. ఇకనుంచి ఉదయం, సాయంత్రం వేళ ప్రకృతి అందాల పలకరింతలు..పక్షుల కిలకిలరావాలు..ఆహ్లాదకర వాతావరణంలో వాకింగ్ చేసేలా ట్రాక్‌లు అందుబాటులోకి రానున్నాయి. ఔటర్ రోడ్డు చుట్టూ ఆహ్లాదానికి నిలయంగా 16 చోట్ల ఆక్సిజన్ పార్కులు నగరవాసులను ఆహ్వానించేలా సుందరంగా ముస్తాబయ్యాయి. ఇప్పటికే కొన్ని అర్బన్ ఫారెస్ట్ బ్లాకులను ప్రారంభించగా.. గురువారం ఆరుచోట్ల ఉద్యానవనాలను మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, సబితారెడ్డిలు ప్రారంభించనున్నారు.
స్వచ్ఛమైన గాలి.. ఆహ్లాదకర వాతావరణం
రోజురోజుకు పెరుగుతున్న పట్టణీకరణతో కాలుష్యం..పనిఒత్తిడి..వెరసి జీవన విధానంలో వస్తున్న మార్పులతో ఎన్నో అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. వీటి నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అర్భన్ ఫారెస్ట్ బ్లాకుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. హెచ్ఎండీఏ పరిధిలో 16 చోట్ల భాగ్యనగర నందనవనం తరహాలో అర్బన్ ఫారెస్ట్ బ్లాకులను ఏర్పాటు చేస్తున్నారు. రంగారెడ్డి, యాదాద్రి, మెదక్, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని 5928.38 హెక్టార్లలో రూ.96.64 కోట్ల అంచనా వ్యయంతో ఈ పనులు చేపట్టారు. ఆయా ఉద్యానవనాల్లో లక్షలాది మొక్కలను నాటారు. కిలోమీటర్ల మేర ప్రహరీ నిర్మాణం, కనువిందు చేసే ప్రవేశద్వారం పనులను పూర్తిచేసి అందుబాటులోకి తీసుకొస్తున్నారు.
ఇవీ ప్రత్యేకతలు
ఆహ్లాదానికి నిలయంగా ఏర్పాటు చేసే అర్భన్ ఫారెస్ట్రీ బ్లాకుల్లో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. వివిధ ప్రాంతాల నుంచి నగరానికి చేరుకునే వారు, నగరం నుంచి కుటుంబసభ్యులతో పార్కుకు వెళ్లి సేదతీరేలా సుందరంగా తీర్చిదిద్దారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో నడక కోసం వాకింగ్ పాత్‌వేలు, సైకిలింగ్ కోసం సైకిల్ ట్రాక్‌లు, పిల్లల కోసం చిల్డ్రన్కార్నర్లను ఏర్పాటు చేశారు. అటవీ అందాలను తిలకించేలా వాచ్‌టవర్ ఏర్పాటు చేశారు. యోగా కేంద్రాలు, సందర్శకులు కూర్చోడానికి భారీవృక్షాల కింద రచ్చబండలను నిర్మించారు. వాష్‌రూమ్‌లు, గజేబో (గుడిసెలు)లు, సెక్యూరిటీ రూం, టికెట్ కౌంటర్లను ఏర్పాటు చేశారు.
నేడు ఆరు పార్కుల ప్రారంభోత్సవం
మహానగరాన్ని పచ్చదనంగా మార్చడంతోపాటు నగరవాసులకు ఆహ్లాదాన్నిచ్చే లక్ష్యంలో భాగంగా ఏర్పాటు చేసిన ఆరు అర్బన్ ఫారెస్ట్ పారులను గురువారం అటవీ,పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితారెడ్డిలు ప్రారంభించనున్నారు. ఒకేసారి ఆరుచోట్ల పార్కులను ప్రారంభించడం విశేషం. ఉదయం 9 గంటలకు నాగారం, 10.35 గంటలకు పల్లెగడ్డ, 11 గంటలకు సిరిగిరిపూర్, 11.30 గంటలకు శ్రీనగర్, 12 గంటలకు తుమ్మలూరు, 12.40 గంటలకు మన్యంకంచ అర్బన్ ఫారెస్ట్ పార్లను ప్రారంభిస్తారు.