సిటీబ్యూరో, జూలై 26(నమస్తే తెలంగాణ): ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ అవసరాలకు అనుగుణంగా గత నాలుగు విద్యా సంవత్సరాల నుంచి రాష్ట్రంలోని పలు యూనివర్సిటీలలో ఇంజినీరింగ్ కోర్సులో డాటా సైన్స్, ఏఐఎంఎల్, ఐవోటీ వంటి ఎమర్జింగ్ కోర్సులు ప్రవేశ పెట్టారు. కాలేజీలు, విద్యార్థుల నుంచి మంచి ఆదరణ లభిస్తున్నది. అదే క్రమంలో పాలిటెక్నిక్ కాలేజీలలో కూడా డాటాసైన్స్, ఏఐఎంఎల్, ఐవోటీ, సైబర్ సెక్యూరిటీ వంటి వాటిలో డిప్లమా కోర్సులు అందుబాటులోకి తీసుకువచ్చారు.
అయితే, పదో తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు డిప్లమాలో కంప్యూటర్ సైన్స్, ఈసీఈ, సివిల్, మెకానికల్ వంటి వాటి కోర్సుల కంటే ఎమర్జింగ్ కోర్సులు ఎంపిక చేసుకోవడానికే ఎక్కువ మొగ్గు చూపుతున్నట్లు పాలిసెట్ కౌన్సెలింగ్ అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో రోబోటిక్ కోర్సులపైనా విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం, 2022 – 23వ విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీలలో డిప్లమా సీట్ల భర్తీ కోసం వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతున్నది. ఇందుకు సంబంధించి ఈ నెల 27న పాలిసెట్ కౌన్సెలింగ్ ద్వారా సీట్ల కేటాయింపు చేయనున్నారు.
బీ టెక్‌లో లాటరల్ ఎంట్రీ ద్వారా ప్రవేశాలు..
డిప్లమా స్థాయిలో డాటాసైన్స్, ఏఐఎంఎల్, సైబర్ సెక్యూరిటీ, ఐవోటీ వంటి ఎమర్జింగ్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు బీ టెక్‌లో అదే గ్రూపులో లాటరల్ ఎంట్రీ ద్వారా ప్రవేశం పొందే సౌకర్యం ఉంది. అందుకోసం ప్రభుత్వం ప్రతి ఏడాది నిర్వహించే ఈసెట్ పరీక్షలకు హాజరు కావాల్సి ఉంది. బీ టెక్‌లో లాటరల్ ఎంట్రీకి అవకాశం ఉండటంతో పాలిటెక్నిక్‌ల ద్వారా అందించే డిప్లమాలో కొత్త కోర్సులకు ఫుల్ డిమాండ్ ఉందని అధికారులంటున్నారు. అయితే, గతేడాది వరకు కొత్త కోర్సులు కేవలం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల ద్వారా ప్రయోగాత్మకంగా విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువచ్చారు.
ఈ ఏడాది నుంచి కొన్ని ప్రైవేటు డిప్లమా కాలేజీలలో కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. ఏఐసీటీఈ నియమ నిబంధనల ప్రకారం, కొత్త కోర్సులు ప్రవేశ పెట్టడానికి కావాల్సిన సదుపాయాలు, టీచింగ్ ఫ్యాకల్టీ సిద్ధం చేసుకున్న కాలేజీలకు ప్రభుత్వం అనుమతిస్తున్నది. ఈ క్రమంలో భవిష్యత్తులో కూడా మార్కెట్ అవసరాలకు అనుగుణంగా మరికొన్ని కొత్త కాంబినేషన్లతో డిప్లమాలో పలు రకాల కొత్త కోర్సులు అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని సబ్జెక్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.