మియాపూర్, జూలై 25 : నిర్మాణ వ్యర్థాల అడ్డగోలు డంపింగ్నకు పులిస్టాప్ పెట్టేందుకు బల్దియా కసరత్తులు ప్రారంభించింది. అనధికారిక డంపింగ్లను నిరోధించేందుకు కొత్త వ్యూహాన్ని అనుసరిస్తున్నది. ఇందుకోసం శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని శేరిలింగంపల్లి, చందానగర్ సర్కిళ్లను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసింది. వినూత్నమైన ప్రయత్నాల ద్వారా ఈ సర్కిళ్లలో విజయవంతంగా నిర్మాణ వ్యర్థాల డంపింగ్‌ను గుర్తించిన ప్రదేశాల నుంచి జీడిమెట్ల డంప్ యార్డుకే తరలించేలా ప్రయత్నాలను మొదలుపెట్టింది. జూన్ మొదటి నుంచి ఈ రెండు సర్కిళ్లలో పైలట్ ప్రాజెక్టు నిబంధనల అమలును ప్రారంభించింది. వీటి తరలింపును రాంకీ సంస్థ చేపడుతుండగా.. కాలనీల నుంచి నిర్దేశిత ప్రాంతాలకు తరలించేలా స్థానిక ట్రక్కు నిర్వాహకులను భాగస్వాములను చేస్తున్నారు.
153 ఫోన్ కాల్స్..
భవన నిర్మాణ వ్యర్థాలను రాంకీ సంస్థకు అందించేందుకు గాను బల్దియా ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబరు( 18001201159)ను జోనల్ అధికారులు అందుబాటులోకి తీసుకువచ్చారు. దీనికి తోడు వాట్సాప్ నంబరు 9100927073 ఏర్పాటు చేశారు. నిర్మాణ వ్యర్థాలు కలిగి ఉన్న నిర్మాణదారులు, యజమానులు సదరు టోల్‌ఫ్రీ నంబరుకు ఫోన్ చేయడం ద్వారా రాంకీ సంస్థ నిర్వాహకులే ఇండ్ల వద్దకు వచ్చి వ్యర్థాలను తీసుకెళ్తారు. ఇందుకోసం టన్నుకు రూ.350 చొప్పున యజమానుల నుంచి వసూలు చేస్తారు. కాగా జూన్ మొదటి వారం నుంచి ఇప్పటి వరకు పైలట్ ప్రాజెక్టుగా ఉన్న ఈ రెండు సర్కిళ్లలో కలిపి 153 ఫోన్ కాల్స్ వచ్చాయి. తద్వారా 270 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను నివాసాల నుంచి గుర్తించిన డంప్ యార్డులకు.. అక్కడి నుంచి జీడిమెట్ల డంప్ యార్డుకు 240 మెట్రిక్ టన్నులను సదరు సంస్థ తరలించింది.
ఈ నేపథ్యంలో ఈ రెండు సర్కిళ్లలో సుమారు 25కు పైగా ప్రాంతాల్లో స్థానిక ట్రక్కుల నిర్వాహకులు అనధికారికంగా నిర్మాణ వ్యర్థాలను డంప్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అక్కడ వేయకుండా సెక్యూరిటీని నియమించారు. అయితే పైలట్ ప్రాజెక్టుగా గుర్తించిన నెలకు పైగా స్థానిక ట్రక్కుల నిర్వాహకులు గుర్తించిన ప్రాంతాలకు కూడా ఒక్క ట్రక్కును తరలించకపోవటం గమనార్హం. అయితే నిర్మాణ వ్యర్థాల నిర్వహణపై ప్రజలలో అవగాహనకు శేరిలింగంపల్లి జోనల్ అధికారులు రెండు సర్కిళ్లలో కరపత్రాలు, ఫ్లెక్సీలు, సామాజిక మాధ్యమాలు, ఎఫ్ఎం రేడియో, మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నారు.
రెండు సర్కిళ్లలో నాలుగు డంప్ యార్డులు..
ఎక్కడపడితే అక్కడ నిర్మాణ వ్యర్థాలను డంప్ చేయకుండా రెండు సర్కిళ్ల పరిధిలో 4 అధికారిక డంపింగ్ ప్రాంతాలను గుర్తించారు. శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలో నలగండ్ల ఫ్లైఓవర్, ఖాజాగూడ స్టేడియం బహిరంగ స్థలాన్ని.. చందానగర్ సర్కిల్ పరిధిలో హఫీజ్‌పేట్ ఫ్లై ఓవర్, దీప్తిశ్రీనగర్ డంపింగ్ స్టేషన్ ప్రాంతాల్లో మాత్రమే నిర్మాణ వ్యర్థాలు డంప్ చేయాలని ప్రచారం చేశారు. ఇటీవలే రెండు సర్కిళ్ల పరిధిలోని ట్రక్కు ఆపరేటర్లతో సమావేశం నిర్వహించి సదరు ప్రాంతాల్లోనే వ్యర్థాలను డంప్ చేయాలని, నిబంధనలను అతిక్రమిస్తే భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. అయితే ఇప్పటికే కొందరు ట్రక్కుల నిర్వాహకులు అనధికార ప్రాంతాలలో సెక్యూరిటీని బెదిరించి వ్యర్థాలను రాత్రి వేళల్లో డంప్ చేస్తున్నారు. దీన్ని నియంత్రించేందుకు వాహనాలపై విజిలెన్స్ దృష్టి తప్పనిసరన్న అభిప్రాయాలు నెలకొంటున్నాయి.
ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం
నిర్మాణ వ్యర్థాల నిర్వహణ కోసం శేరిలింగంపల్లి, చందానగర్ సర్కిళ్లను ఉన్నతాధికారులు పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. నిర్మాణ వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ డంప్ చేస్తుండటం వల్ల ఎన్నో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేస్తే ఇండ్ల వద్దకే వచ్చి రాంకీ సంస్థ వ్యర్థాలను సేకరిస్తుంది. ఇందుకోసం టన్నుకు రూ.350 వసూలు చేస్తున్నది. ప్రజలు, నిర్మాణ దారులు, యజమానుల భాగస్వామ్యంతో ఎవరికీ ఆటంకం లేకుండా డంప్ యార్డుకు తరలించటంలో విజయం సాధించగలుగుతాం. స్థానిక ట్రక్కు ఆపరేటర్లు సైతం ఈ రెండు సర్కిళ్ల పరిధిలో గుర్తించిన ప్రాంతాలలోనే నిర్మాణ వ్యర్థాలను డంప్ చేసేలా వారితో అవగాహన సమావేశాలను నిర్వహించాం. పైలెట్ ప్రాజెక్టును విజయం చేసేందుకు ప్రజలు తమ తోడ్పాటును అందించాలి.
– శంకరయ్య, జోనల్ కమిషనర్ శేరిలింగంపల్లి జోన్