కార్పొరేట్ స్థాయిలో ఉచిత విద్యాబోధన.. పాఠ్యపుస్తకాలు.. మధ్యాహ్న భోజనం.. చక్కటి మౌలిక వసతులు.. ఆహ్లాదకరమైన వాతావరణం.. ఇంతటి మంచి అవకాశాలను ఎవరైనా వదులుకుంటారా.. అందుకే తమ పిల్లలను సర్కారు బడుల్లో చేర్పించేందుకు తల్లిదండ్రులు మొగ్గు చూపుతున్నారు. దీనికి తోడు బడిబాట కార్యక్రమం ద్వారా ఉపాద్యాయుల బృందం విద్యార్థులకు అందించే సౌకర్యాలను వివరిస్తుండటంతో అధిక ఫీజుల మోతతో బెంబేలెత్తిస్తున్న ‘ప్రైవేటు’ వద్దంటూ.. తల్లిదండ్రులు ప్రభుత్వ స్కూళ్లకే జై కొడుతున్నారు. ఈ విద్యాసవత్సవరం నుంచి ఇంగ్లిష్ మీడియం చదువులు కూడా మొదలు కావడంతో అంచనాలకు మించి అడ్మిషన్లు వస్తున్నాయి. ముఖ్యంగా మహేశ్వరం మండల పరిధిలోని ప్రైవేట్ పాఠశాలల నుంచి 536 మంది విద్యార్థులు సర్కారు బడుల్లో చేరడం తమనార్హం.
మహేశ్వరం, జూలై 25: మహేశ్వరం మండలంలో ఉన్న ప్రభుత్వ బడుల్లో గతంలో కంటే ఈ సంవత్సరం సర్కారు బడులకు ఆదరణ బాగా పెరిగిందని అధికారులు చెబుతున్నారు. గత నెలలో నిర్వహించిన బడిబాటలో భాగంగా ఇప్పటి వరకు పెద్ద సంఖ్యలో విద్యార్థులు ప్రైవేటు నుంచి సర్కారు బడుల్లో చేరినట్లు అధికారులు చెబుతున్నారు. గతంలో కంటే ఈ విద్యా సంవత్సరంలో మండల వ్యాప్తంగా 536 మంది విద్యార్థులు సర్కారు బడుల్లో అడ్మిషన్లు తీసుకున్నారని మండల అధికారులు పేర్కొంటున్నారు. సర్కారు పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధిస్తుండటంతో ప్రజలు హర్షిస్తున్నారు.
కార్పొరేటు విద్యను అందిస్తున్నాం..
అన్ని సర్కారు బడుల్లో కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్నాం. మన ఊరు- మనబడిలో భాగంగా పాఠశాలలో 12 అంశాలతో కూడిన మౌలిక వసతులను కలిపిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించడానికి ఆసక్తి చూపుతున్నారు. సర్కారు బడుల్లో నాణ్యమైన విద్యతో పాటు మంచి భోజనాన్ని అందిస్తున్నాం. ప్రభుత్వ బడుల్లో విద్యార్థులను చదివించేందుకు శ్రీకారం చుట్టిన బడి బాట కార్యక్రమం మంచి ఫలితాలను ఇచ్చింది. సీఎం కేసీఆర్ ముందు చూపుతో మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ పథకం ద్వారా ప్రభుత్వ బడులకు మహర్దశ సంతరించుకున్నది. ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెట్టిన తర్వాతనే ప్రభుత్వ బడుల్లో అడ్మిషన్లు పెరిగాయి. బడిబాట కార్యక్రమంలో ఉపాధ్యాయులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని విజయవంతం చేశారు.
– సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి
పెరిగిన హాజరు శాతం..
ఈ ఏడాది ప్రభుత్వ బడుల్లో హాజరు శాతం పెరిగింది. తెలంగాణ ప్రభుత్వం 1వ తరగతి నుంచి ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడంతో వివిధ గ్రామాల తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రైవేటు స్కూళ్ల నుంచి సర్కారు పాఠశాలలో చేర్పిస్తున్నారు. సర్కారు బడుల్లో కార్పొరేటుకు దీటుగా మౌలిక వసతులు కలిపిస్తున్నారు. సర్కారు బడుల్లో మంచి నైపుణ్యత గల ఉపాధ్యాయులు ఉండి నాణ్యమైన బోధన చేస్తున్నారు. స్కూల్ కమిటీ ఉంటుంది. పిల్లల చదువుల తీరుపై ఉన్నత స్థాయి అధికారుల పర్యవేక్షణ ఉంటుంది. ఈ విద్యా సవంత్సరంలో మండల వ్యాప్తంగా 536 మంది విద్యార్థులు సర్కారు బడుల్లో చేరినారు. – కృష్ణయ్య, మండల విద్యాధికారి