బడంగ్‌పేట, జూలై 25: మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్‌ను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రశాంత్ హిల్స్ 10, 11 డివిజన్లలో తాగునీటి పైపులైన్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాలనీల్లో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి కృషి చేస్తున్నామన్నారు. పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం రూ.1200 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. ప్రస్తుతం పనులు జరుగుతున్నాయన్నారు. పాత పైపులైన్లు ఉన్న చోట కొత్త పైపులైన్లు, మరమ్మతులు చేయిస్తామన్నారు. మున్సిపల్ కార్పొరేషన్లో అవసరమైన నిధులు కేటాయించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అభయం ఇచ్చారన్నారు. కాలనీల్లో ఉన్న సమస్యలను స్థానిక కార్పొరేటర్లు ధనలక్ష్మి, ముద్ద పవన్ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కంకర తేలిన రోడ్లు వేసి చాలా రోజులు అవుతున్నా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి మంత్రికి వివరించారు.
ప్రతి శుక్రవారం క్లీన్ అండ్ గ్రీన్..
కాలనీల్లో ప్రతి శుక్రవారం క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి అన్నారు. సీజనల్ వ్యాధులు రాకుండా ప్రజలు తగు జాగ్రతలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ దుర్గా దీప్లాల్ చౌహాన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, కమిషనర్ సీహెచ్ నాగేశ్వర్, డీఈ గోపీనాథ్, స్థానిక కార్పొరేటర్లు ధనలక్ష్మి, ముద్ద పవన్, భూపాల్‌రెడ్డి, కో-ఆప్షన్ సభ్యులు రజాక్, పల్లె జంగయ్య, టీఆర్ఎస్ నాయకులు అర్కల కామేశ్‌రెడ్డి, సిద్దాల బీరప్ప, దిండు భూపేశ్‌గౌడ్, నర్సిరెడ్డి, తదితరులు ఉన్నారు.