సిటీబ్యూరో, జూలై 24(నమస్తే తెలంగాణ): కవిత్వమనే ఖడ్గంతో అసమానతల్ని చీల్చి..మానవతా పరిమళంగా గుర్రం జాషువా కలం, కవిత్వం నేటికీ వెలుగొందుతూనే ఉన్నదని ప్రముఖ సినీనటుడు, రచయిత తనికెళ్ల భరణి అన్నారు. తనకు జాషువా, కరుణశ్రీ రెండు కండ్లలాంటి వారని గుర్తు చేశారు. జాషువా సాహిత్య వేదిక ఖమ్మం – తెలుగు శాఖ, సిటీ ప్రభుత్వ కళాశాల హైదరాబాద్ సంయుక్తాధ్వర్యంలో ప్రముఖ కవి డాక్టర్ కోయి కోటేశ్వర్రావు అధ్యక్షతన నిర్వహించిన వెబినార్ కార్యక్రమంలో తనికెళ్ల భరణి, ప్రముఖ రచయిత, పూర్వపు ఆకాశవాణి ప్రయోక్త వోలేటి పార్వతీశం, ప్రముఖ దర్శకుడు జేకే భార్గవి ముఖ్యఅతిథులుగా హాజరై ప్రసంగించారు. ‘మానవతావాద మ్యానిఫెస్టో’ లాగా జాషువా కవిత్వం వర్ధిల్లుతుంటుందని కొనియాడారు. తిరుపతి వేంకట కవుల నుంచి ప్రశంసలందుకున్న మహాకవి అని గుర్తు చేశారు.
ఒక కంట కన్నీరు ధారలై కారుతున్నా.. మరో కంట సంతోషాన్ని వెలిగించేంతటి రచనలు జాషువా సొంతమన్నారు. గబ్బిలాన్నే ఈశ్వరుడి వద్దకు రాయబారిగా పంపిన కవి అని, కళాప్రపూర్ణుడు, విశ్వనరుడిగా తెలుగు భాష ఉన్నంత వరకు ఆయన అందరివాడుగా ఉంటారని చెప్పారు. కోయి కోటేశ్వర్రావు మాట్లాడుతూ.. తల్లి ఆలింగనం ముందు 10వేల స్వర్గాలైనా వెలితిగానే ఉంటుందని నొక్కి చెప్పిన విశ్వకవి జాషువా అని ప్రకటించారు. వెయ్యేండ్ల తెలుగు సాహిత్యంలో 200 అంశాలపై తన రచనలు గావించారని గుర్తు చేశారు. ‘పావురాలు గుడి గోపురంపై ఉంటాయట, గబ్బిలాలు దేవుడి గర్భగుడిలో ఉంటాయట.. మరి మనుషులను గుడిమెట్లక్కనియ్యరట. ఎందుకు.? అని ప్రశ్నించిన విశ్వనరుడు జాషువా అని అన్నారు. మాతృగర్భం నుంచి కాలగర్భం వరకు తన కవిత్వాన్ని ఖడ్గంలా మలిచారని, స్వర్గం కంటే జన్మభూమినే ఎక్కువగా ప్రేమించిన ప్రేమ పిపాసని ఉదాహరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత మువ్వా శ్రీనివాస్, సిటీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.బాలభాస్కర్, డాక్టర్ నీరజ, పలువురు అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.