శంషాబాద్ రూరల్, జూలై 23 : అమ్మవార్లను మనసారా కొలుద్దాం.. బోనాల సంబురాలను ఘనంగా నిర్వహించుకుందామని జడ్పీటీసీ, రంగారెడ్డి జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నీరటి తన్విరాజు తెలిపారు. లాల్ దర్వాజ బోనాల ఉత్సవాల సందర్భంగా శనివారం అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో ఆషాఢ మాసంలో జరిగే బోనాల ఉత్సవాలకు ప్రపంచంలో గుర్తింపు వచ్చే విధంగా ప్రభుత్వం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకుడు నీరటి రాజుముదిరాజ్, ఆలయ కమిటీ చైర్మన్ శివకుమార్ యాదవ్, సురేందర్ ముదిరాజ్, రాజ్‌కుమార్, బద్రీగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ముస్తాబైన ఆలయాలు
బండ్లగూడ,జూలై 23: రాజేంద్రనగర్ సర్కిల్, బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆదివారం నిర్వహించనున్న బోనాల ఉత్సవాలకు ఆలయ కమిటీ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఆలయానికి రంగులు అద్దడంతో పాటు చుట్టూ పక్కల ప్రాంతాల్లో పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రం చేశారు. బోనాలతో వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. రాజేంద్రనగర్, అత్తాపూర్ మైలార్‌దేవ్‌పల్లి, శాస్త్రిపురం, సులేమాన్ నగర్, బుద్వేల్, శివరాంపల్లి, బండ్లగూడ, కిస్మత్పూర్, పీరం చెరువు, హైదర్షాకోట్ తదితర ప్రాంతాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు.