బంజారాహిల్స్,జూలై 23: 40 ఏండ్లుగా ఇబ్బందులను ఎదుర్కొంటున్న గురుబ్రహ్మనగర్ వాసులకు త్వరలోనే మంచిరోజులు రానున్నాయని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. శనివారం జూబ్లీహిల్స్ డివిజన్ గురుబ్రహ్మనగర్‌కు చెందిన పలువురు స్థానికులు ఎమ్మెల్యే నాగేందర్‌ను కలిసి సమస్యలను వివరించారు. బస్తీలో ఎన్నో ఏండ్లుగా నివాసం ఉంటున్న తమకు జేఎన్ఆర్ఎమ్ ఇండ్లు కేటాయించి అర్ధాంతరంగా పనులు నిలిపివేశారని, నివాసం ఉంటున్న చోటనే జీవో 58 కింద పట్టా లు ఇప్పించాలని కోరారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే పేదల బస్తీలలో క్రమబద్ధీకరణ సమస్య పై జిల్లా కలెక్టర్‌తో మాట్లాడానని, త్వరలోనే శుభవార్త చెబుతానని హామీ ఇచ్చారు.
బస్తీల్లో ఐకమత్యంతో ఉండి సమస్యలకు పరిష్కారం కనుక్కోవాలని, గ్రూపులతో ఒకరిమీద ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం మానుకోవాలని హితవు చెప్పారు. జూబ్లీహిల్స్ కార్పొరేటర్ వెల్దండ వెంకటేశ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మామిడి నర్సింగరావు, బస్తీ నేతలు గోపాల్ నాయక్, రాంచందర్, రవినాయక్, మాణిక్యం పాల్గొన్నారు.