బంజారాహిల్స్,జూలై 23: షేక్‌పేట మండల పరిధిలోని బంజారాహిల్స్ రోడ్ నం.14లో ప్రభుత్వ స్థలంలో వెలిసిన అక్రమ నిర్మాణాలను శనివారం రెవెన్యూ సిబ్బంది కూల్చేశారు. సర్వే నంబర్ 403/పీలోని టీ ఎస్ నం.17, బ్లాక్ డీ, వార్డు 10లో ఉన్న 2.10 ఎకరాల స్థలంపై 40 ఏండ్లు గా వివిధ న్యాయస్థానాల్లో కేసులు నడుస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ స్థలం ప్రభుత్వానిదేనని 1981లో సిటీ సివిల్ కోర్టు తీర్పు నిచ్చింది. కాగా స్థలం తమదే అంటూ వాదిస్తున్న బాదం రంగస్వామి అనే వ్యక్తితో పాటు మరికొందరు హైకోర్టును ఆశ్రయించారు. గత ఏడాది స్థలం బాదం రంగస్వామి తదితరులకు చెందినదే అంటూ హైకోర్టులో తీర్పు వచ్చింది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది.
ఈనెల 11న ఈ స్థలం ప్రభుత్వానిదే అంటూ సుప్రీంకోర్టులో తుదితీర్పు వచ్చింది. సుమారు రూ.300 కోట్ల విలువైన ఈ స్థలాన్ని షేక్‌పేట మండల సిబ్బంది స్వాధీనం చేసుకుని ప్రభుత్వ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా ఈ స్థలాన్ని ఆనుకుని మద్దె కల్పన అనే మహిళకు చెందిన ఇల్లు ఉంది. సుమారు 300గజాల మేర ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించినట్లు తేలడంతో శనివారం షేక్‌పేట రెవెన్యూ సిబ్బంది అక్కడకు చేరుకుని అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చేశారు.