సిటీబ్యూరో, జూలై 23 (నమస్తే తెలంగాణ): ప్రమాదాల్లో గాయపడిన వారికి సకాలంలో అవసరమైన చికిత్స అందించే ట్రామా కేర్ సెంటర్ల వల్ల మరణాల రేటు తగ్గుతుందని సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అన్నారు. శనివారం గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్లో నూతనంగా ఏర్పాటు చేసిన అడ్వాన్స్డ్ ట్రామా అండ్ ఎమర్జెన్సీ సెంటర్ను ఆయన ప్రారంభించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ రాష్ట్రంలోనే అత్యధిక రోడ్డు ప్రమాదాలు సైబరాబాద్లోనే జరుగుతున్నాయని, దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రమాదాల నివారణతో పాటు బాధితులకు సకాలంలో సరైన చికిత్స అందించే అంశాలపై తాము ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు వివరించారు.
మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం, అతి వేగం వంటి కారణాలతో ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని, వీటిని అరికట్టేందుకు శాయశక్తులా కృష్టి చేస్తున్నప్పటికీ ప్రజలకు మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఏఐజీ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్రెడ్డి మాట్లాడుతూ ప్రమాదాలు జరిగినప్పుడు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో లైఫ్ సేవింగ్, ఫస్ట్ ఎయిడ్ చికిత్స అందించడంపై 200 మంది వలంటీర్లకు ప్రత్యేక శిక్షణ కల్పించినట్లు చెప్పారు. కార్యక్రమంలో రాచకొండ భద్రతా మండలి ప్రతినిధి గగన్దీప్సింగ్ కోహ్లీ, సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రతినిధి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.