బోనాల ఉత్సవాలకు పాతనగరం ముస్తాబైంది. ఆషాఢమాసం ఆఖరి ఆదివారం లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి ఆలయంతోపాటు ఎల్బీనగర్, మలక్‌పేట, అంబర్‌పేట, ఉప్పల్ తదితర నియోజకవర్గాల్లో బోనాల జాతర అంగరంగ వైభవంగా జరగనుంది. తీరొక్క పూలతో అలంకరణ, మిరుమిట్లు గొలిపే విద్యుత్‌కాంతుల్లో ఆలయాలు కొత్త శోభను సంతరించుకున్నాయి. లాల్‌దర్వాజ అమ్మవారికి ప్రభుత్వం తరఫున దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పట్టువస్ర్తాలు సమర్పించనున్నారు. సుమారు 3 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేసి అన్ని ఏర్పాట్లు చేశారు. దాదాపు వెయ్యిమంది పోలీసులతో బందోబస్తు చేపడుతుండగా, ఆలయానికి చేరుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి 150 ఆర్టీసీ బస్సులను నడుపనున్నారు.
-చాంద్రాయణగుట్ట, జూలై 23
సిటీబ్యూరో, జూలై 23 (నమస్తే తెలంగాణ)/ చాంద్రాయణగుట్ట: పాతబస్తీ లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి ఆలయంలో ఆషాఢమాసం బోనాలకు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వం తరుఫున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, మంత్రి శ్రీనివాస్‌యాదవ్, హోంమంత్రి మహమూద్ అలీ అమ్మవారికి పట్టు వస్ర్తాలు సమర్పించనున్నారు. 114వ బ్రహోత్సవాలు వైభవంగా జరిగేందుకు ఆలయం వద్ద అధికారులు, ఆలయ కమిటీ ప్రతినిధులు సర్వం సిద్ధం చేశారు. ఆదివారం ఉ. 3గంటలకు జల్లెకడువ నిర్వహణ, ఉ. 4 గంటలకు బలిహరణ పూజలు, ఉ. 5.30 దేవి మహాభిషేకం పూజ అనంతరం అమ్మవారికి బోనాల సమర్పణ ప్రారంభమవుతుంది.
పండుగ సందర్భంగా అమ్మవారి ఆలయం విద్యుత్ దీపాల కాంతులతో విరాజిల్లుతుంది. పాతనగరంతో పాటు వివిధ జిల్లాల నుంచి దాదాపుగా 3 నుంచి 5లక్షల మంది భక్తులు హజరయ్యే అవకాశాలు ఉన్నట్లు ఆలయ ప్రతినిధులు అంచనా వేస్తున్నారు. నగరంలో 25 డిపోల నుంచి 150 ప్రత్యేక బస్సులను నడిపించనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ జోన్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ ఈ యాదగిరి తెలిపారు. జలమండలి, విద్యుత్‌తో పాటు వివిధ విభాగాల శాఖలతో జీహెచ్ఎంసీ అధికారులు సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లు చేస్తున్నారు. దక్షిణ మండలం డీసీపీ పి.సాయిచైతన్య ఆధ్వర్యంలో వెయ్యి మంది పోలీసులు బందోబస్తును నిర్వహిస్తున్నారు.
బోనాలు జరిగే ఆలయాలు
లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి ఆలయం, హరిబౌలి అక్కన్నమాదన్న దేవాలయం, సుల్తాన్షాహి జగదాంబ రేణుక ఎల్లమ్మ దేవాలయం, బేలా మాతేశ్వరీ ముత్యాలమ్మ దేవాలయం, చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారు, ఉప్పుగూడ మహంకాళి ఆలయం, గౌలిపురా భరతమాత మాతేశ్వరీ, మహంకాళి దేవాలయం, నల్లపోచమ్మ దేవాలయం మేకలబండ, మహాకాళేశ్వరస్వామి దేవాలయం మీరాలమండి, దర్బార్ బంగారు మైసమ్మ దేవాలయం అలియాబాద్.