అబిడ్స్, జూలై 21 : గోషామహల్ బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. గురువారం చాక్నావాడి ఆలయంలో జరిగిన పూజలలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాయకులు నందకిశ్ర్ వ్యాస్ బిలాల్, నియోజకవర్గ ఇన్చార్జి ప్రేమ్‌సింగ్ రాథోడ్, నాయకులు ఆనంద్ కుమార్ గౌడ్, ముఖేష్ సింగ్, సంతోష్ గుప్త, శాంతిదేవి పాల్గొన్నారు.
భాగ్యలక్ష్మి అమ్మవారికి బోనం ..
చార్మినార్ : బోనాలు ఆడబిడ్డలకు ప్రియమైన పండగని బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు తెలిపారు. బుధవారం ఓబీసీ సెంట్రల్ కమిటీ ఆధ్యక్షురాలు ఆలె భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి బోనాలను సమర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కృష్ణమోహన్‌రావు హాజరై అమ్మవారికి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు దశరథలక్ష్మి, లతారెడ్డి, మణిమంజరి, నాయకులు పాల్గొన్నారు.
గోల్కొండ అమ్మవారికి..
మెహిదీపట్నం : ఆషాఢ మాసం బోనాల జాతరలో భాగంగా గురువారం గోల్కొండ కోటలోని అమ్మవారికి భక్తులు ఏడో పూజను ఘనంగా నిర్వహించారు. నగరంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారికి బోనాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు అమ్మవారు శాకాంబరిగా దర్శనం ఇచ్చారు. సాయంత్రం కోటలో అమ్మవారికి శేవా ఊరేగింపును చేపట్టారు. అమ్మవారికి టీఆర్ఎస్ నాయకుడు శేఖర్‌రెడ్డి, ఆలయ ట్రస్టు చైర్మన్ మహేశ్వర్లు పూజలు నిర్వహించారు.
హరిబౌలి బేలా ముత్యాలమ్మ ..
చాంద్రాయణగుట్ట : హరిబౌలి బేలా ముత్యాలమ్మ దేవాలయంలో అమ్మవారు శాకాంబరి రూపంలో భక్తులకు దర్శన మిచ్చారు. తీరొక్క కూరగాయాలతో అమ్మవారిని అలంకరించారు.
గౌలిపురా శ్రీ మహంకాళి భరతమాత..
బోనాల ఉత్సవాల సందర్భంగా గౌలిపురా శ్రీ మహంకాళి భరతమాత ఆలయంలో అమ్మవారిని గాజులతో అలంకరించారు. మురళీపంతుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ అమ్మవారి పూజలను భక్తులు నిర్వహిస్తున్నారు.