బాలానగర్, జూలై 21 : దేశంలో ఎక్కడాలేని విధంగా హైదరాబాద్ నగరంలోని ఫతేనగర్‌లో చేపట్టిన మురుగునీటి శుద్ధి కేంద్రం (ఎస్టీపీ) పనులు త్వరలో పూర్తి కానున్నాయని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. గురువారం ఫతేనగర్ ఎల్బీఎస్నగర్లో చేపట్టిన మురుగునీటి శుద్ధి కేంద్రం పనులను డివిజన్ కార్పొరేటర్ పండాల సతీశ్‌గౌడ్‌తో కలిసి ఆయన పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జలమండలి, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి ఆయన సమీక్ష జరిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశంలోని ముఖ్య నగరాలలో ఎక్కడాలేని విధంగా హైదరాబాద్ నగరంలో ఎస్టీపీల నిర్మాణం ప్రభుత్వం చేపట్టిందని పేర్కొన్నారు. ఫతేనగర్‌లో 11ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఎస్టీపీ ద్వారా నిత్యం 1000 ఎమ్మెల్డీల మురుగనీరు శుద్ధి అవుతుందని తెలిపారు. జీడిమెట్ల, బాలానగర్, కూకట్పల్లి, సురారం, జగద్గిరిగుట్ట ప్రాంతాల నుంచి వచ్చే మురుగునీరు ఫతేనగర్‌లో శుద్ధి చేయడం కోసం ఎస్టీపీ నిర్మాణ పనులు చేపట్టినట్లు తెలిపారు. ఫతేనగర్‌లో నిర్మిస్తున్న ఎస్టీపీ పనులు మరో ఆరు నెలల్లో పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారని తెలిపారు. ఇక్కడ నిర్మిస్తున్న ఎస్టీపీలో దేసీక్వెన్సియల్ బ్యాచ్ రియాక్టర్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు పేర్కొన్నారు. శుద్ధి చేసిన మురుగునీటిని నాలాలోకి వదులుతారని తెలిపారు. కార్యక్రమంలో జలమండలి, జీహెచ్ఎంసీ అధికారులతో పాటు టీఆర్ఎస్ నేతలు కె రాములు, భిక్షపతి, బాగయ్య, సురేందర్నాయుడు, బస్వరాజ్, సాయినాథ్‌గౌడ్, శంకర్‌గౌడ్, రాజు పాల్గొన్నారు.
కష్టకాలంలో అండగా ప్రభుత్వం
పేదలకు కష్టకాలంలో అండగా ఉంటుందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన 20 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే కృష్ణారావు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనారోగ్యంతో వైద్యశాలలో చేరిన పేదలకు సీఎం రిలీఫ్‌ఫండ్ ఎంతగానో ఆదుకుంటుందన్నారు.
జనతానగర్‌లో పూజలు
ఆషాఢం బోనాల వేడుకలు వైభవంగా సాగాయి. మూసాపేట జనతానగర్‌లోని పోచమ్మ దేవాలయం, ముత్యాలమ్మ దేవాలయం, నల్లపోచమ్మ దేవాలయాలలో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, బాలాజీనగర్ కార్పొరేటర్ పగుడాల శిరీషాబాబురావులు పూజలు చేశారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బాబురావు, బాలాజీనగర్ డివిజన్ అధ్యక్షుడు సీహెచ్.ప్రభాకర్ గౌడ్, సుశీల్‌కుమార్, భాస్కర్‌రావు, శారద, కర్క పెంటయ్య, కర్క నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే
బోనాల వేడకలు గురువారం మూసాపేటలో ఘనంగా జరిగాయి. మూసాపేట డివిజన్ పరిధిలోని బోనాల ఉత్సవాలను పురస్కరించుకొని మాజీ కార్పొరేటర్ తూము శ్రావన్ కుమార్, బాలాజీనగర్ కార్పొరేటర్ శిరీష బాబురావు, ఫతేనగర్ కార్పొరేటర్ పండాల సతీశ్గౌడ్తతో కలిసి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వివిధ కాలనీల్లో అమ్మవారి ఆలయాలను సందర్శించి అమ్మవారికి పూజలు చేశారు.