మేడ్చల్ రూరల్, జూలై 19: ఇంజినీరింగ్ కళాశాలలు ఆవిష్కరణలకు కేంద్రాలుగా మారుతున్నాయి. అధ్యాపకులు అందిస్తున్న ప్రోత్సాహం, యాజమాన్యం అందిస్తున్న తోడ్పాటుతో విద్యార్థులు సృజనాత్మక ఆలోచనలతో ముందుకువస్తున్నారు. సామాజిక సమస్యలకు పరిష్కారం చూపుతూ ఔరా అనిపిస్తున్నారు. విద్యార్జనలో భాగంగా ఇస్తున్న ప్రాజెక్టులను చాలా మంది మొక్కుబడిగా చేస్తూ కోర్సు పూర్తి చేస్తుండగా, కొంత మంది మాత్రం ప్రతిభ చూపుతూ సామాజిక ప్రయోజనాలను నెరవేరుస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై తమ ఆవిష్కరణలు పెడుతూ ప్రశంసలు, గుర్తింపును అందుకుంటూ.. పేటెంట్‌ను పొందే దిశగా ముందుకుసాగుతున్నారు. కరోనా కాలంలో కూడా విపత్తును ఎదుర్కొనే ఉపకరణాలు సృష్టించి, సమాజ హితం కోసం కృషి చేశారు.
ఆవిష్కరణలు ఎన్నెన్నో…
అతి తక్కువ ఖర్చుతో గీజర్గా ఉపయోగపడే ఇమర్షన్ రాడ్(వాటర్ హీటర్) తయారు చేస్తే, మరొకరు స్పర్శ లేకుండా శరీర ఉష్ణోగ్రతను కొలిచే సాధనాన్ని ఆవిష్కరించారు. ఇంకొరు మెకానికల్ పనిచేసే వారికి ఉపయోగపడే మెకానికల్ క్యాలిక్యులేటర్‌ను తయారు చేశారు. ఒక కళాశాల విద్యార్థులు ఇచ్చిన ఐడియాకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. దాన్ని సమాజానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దేందుకు ఎంఎస్ఎంఈ రూ.15 లక్షలు నిధులు ఇచ్చింది. మరొక కళాశాల విద్యార్థులు ఉన్నత భారత్ అభియాన్(యూబీఏ) జాతీయ స్థాయిలో నిర్వహించిన పోటీల్లో నిలిచి తమ ప్రతిభతో మొదటి, మూడో స్థానాన్ని కైవసం చేసుకున్నారు.
సెల్‌ఫోన్‌తో ఆపరేట్‌చేసే.. సోలార్ ఫర్టిలైజర్ స్ప్రేయర్
మేడ్చల్ మండలం గౌడవెల్లి గ్రామ పరిధిలోని హైదరాబాద్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్(హితం) కళాశాలకు చెందిన విద్యార్థులు కృష్ణ, శీబా శశిష్టా ‘సోలార్ ఫర్టిలైజర్ స్ప్రేయర్’ తయారు చేశారు. ఈ పరికరాన్ని సెల్‌ఫోన్‌తో ఆపరేట్ చేయవచ్చు. పొలంలో ఎక్కడ ఎంత మోతాదులో ఎరువు అవసరమో అంతే మోతాదులో అందజేస్తుంది. అంతేగాకుండా ఎరువులు చల్లడంతో పొడసూపే అనర్థాలకు రైతులు దూరమవుతారు. ఉన్నత అభియాన్ భారత్ కార్యక్రమంలో ఈ పరికరం జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది.
హైడ్రోపోనిక్స్
మేడ్చల్ మండలం గౌడవెల్లి గ్రామ పరిధిలోని హితం కళాశాల విద్యార్థులు సోహెల్, సౌజన్య, రమ్య హైడ్రోపోనిక్స్ విధానాన్ని రూపొందించారు. ఈ పద్ధతిలో ఇటు మొక్కలు, అటు చేపలను పెంచుతారు. చేపల వ్యర్థాలు మొక్కల ఎదుగుదలకు ఉపయోగపడే విధంగా, మొక్కల నాచు చేపల ఎదుగుదలకు ఉపయోగపడే విధంగా శుద్ధి చేసే ట్యాంకులను ఏర్పాటు చేస్తారు. ఈ విధానంతో ఎలాంటి హానికారక పదార్థాలు లేకుండా ఆరోగ్యకరమైన చేపల ఉత్పత్తులను పొందవచ్చు. అలాగే మొక్కలను పెంచవచ్చు. ఈ విధానానికి ఉన్నత భారత్ అభియాన్ జాతీయ స్థాయిలో మూడో స్థానం లభించింది.
ఆటోమెటిక్ వాటర్ హీటర్
గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ కండ్లకోయలోని సీఎంఆర్ సెట్‌కు చెందిన సీఎస్ఈ విద్యార్థులు రాహుల్ సాయి, పులిపాటి అనూష సెంటర్ ఫర్ ఇంజినీరింగ్ ఎడ్యూకేషన్ రీసెర్చ్(సీఈఈఆర్) హెచ్‌వోడీ సురేశ్ రాం పర్యవేక్షణలో ఆటోమెటిక్ వాటర్ హీటర్‌ను తయారు చేశారు. ఈ పరికరం గీజర్‌లా ఉపయోగపడుతుంది. ఒక ఉష్ణోగ్రతకు చేరుకోగానే అలారం మోగి.. ఉష్ణోగ్రత పెరగడం ఆగిపోతుంది. విద్యుదాఘాతం లాంటి ప్రమాదాలకు ఈ పరికరంతో ఆస్కారం లేదు. వాటర్ హీటర్ రూ.300 నుంచి రూ.500 ఖర్చు చేస్తే వస్తుంది. దీనికి మరో రూ.రెండు, మూడు వందలు ఎక్కువ ఖర్చు చేస్తే చాలు గీజర్గా ఉపయోగపడే సురక్షితమైన వాటర్ హీటర్‌ను కొనుగోలు చేయవచ్చని ఆవిష్కకర్తలు సురేశ్ రాం, రాహుల్ తెలిపారు. ‘మా సీనియర్ విద్యార్థి వాటర్ హీటర్ కారణంగా చనిపోయిన ఘటన తనను ఈ పరికరం తయారీకి పురికొల్పింది. ఈ పరికరాన్ని ప్రజలకు ఉపయోగపడేలా తీర్చిదిద్ది, మార్కెట్లోకి తీసుకురావాలన్నది మా గోల్’ అని రాహుల్ తెలిపారు. ఈ పరికరానికి టీఈ గ్రాడ్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో జరిగిన పోటీల్లో ద్వితీయ స్థానం లభించింది. అంతేగాకుండా ఈ పరికరానికి పేటెంట్ లభించింది.
రోడ్ల మరమ్మతులపై సమాచారం
గుండ్లపోచంపల్లి మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల మెయిన్ క్యాంపస్‌కు చెందిన విద్యార్థి గణేశ్‌రావు అధ్యాపకుడు ఎంఎస్ఎంఈ బిజినెస్ ఇంక్యుబేషన్ సెంటర్ కో ఆర్టినేటర్ డాక్టర్ ఎస్కే జాకీర్ హుస్సేన్ మార్గదర్శకత్వంలో పాడైన రోడ్లను గుర్తించే విధానాన్ని ప్రతిపాదించాడు. ఈ డివైస్‌తో రోడ్డుపై వెళ్తుంటే మరమ్మతు చేయాల్సిన రోడ్ల సమాచారాన్ని నేరుగా సంబంధిత శాఖ అధికారులకు పంపుతుంది. దేశ వ్యాప్తంగా ఎంఎస్ఎంఈ ఆహ్వానించిన ఐడియాల్లో ఇది ఎంపికైంది. ఈ ఆలోచనను ఆచరణలోకి తీసుకురావడానికి ఎంఎస్ఎంఈ రూ.15 లక్షలు మంజూరు చేసింది.
ప్రకృతి వైపరీత్యాలపై త్రీడీ చిత్రం
ప్రకృత్రి వైపరీత్యాలపై త్రీడీ పిక్చర్ రూపొందించే విధానాన్ని గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థి మహ్మద్ హసీబ్ హైమద్ సీఎస్ఈ హెచ్‌వోడీ డాక్టర్ లక్ష్మీపతి పర్యవేక్షణలో ప్రతిపాదించారు. ఈ విధానంతో భూకంపాలు, వరదలు లాంటి ఘోర విపత్తులు సంభవించినప్పుడు మనుషులు వెళ్లలేని ప్రదేశాలకు డ్రోన్‌ను పంపి, అక్కడ పరిస్థితి త్రీడీ పిక్చర్ రూపంలో తీసుకుంటారు. తద్వారా బాధితులకు సేవలు అందించే అవకాశం ఉంటుంది. ఇది ఎన్ఆర్ఎస్ఏ, ఆర్మీ లాంటి సంస్థలకు ఉపయోగపడుతుంది. ఈ ఆలోచన ఢిల్లీలో జరిగే హ్యాకథాన్ రెండో రౌండ్‌కు ఎంపికైంది.
త్రీడీ యాంటీ బ్యాక్టీరియల్ మైక్ మాస్క్
కరోనా, ఇతరత్రా వైరస్ సోకుండా ఎదుటి వ్యక్తితో స్పష్టంగా సంభాషించే త్రీడీ యాంటీ బ్యాక్టీరియల్ మైక్ మాస్కును గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ కండ్లకోయలోని సీఎంఆర్ టీసీ సీఎస్ఈ విద్యార్థినులు వేదముఖి, హేమాభియా, నాగశ్రీ , నిఖ్యానా అధ్యాపకులు అజయ్, దుర్గా ప్రసాద్‌రెడ్డి, కేశవరెడ్డి పర్యవేక్షణలో తయారు చేశారు. ఎక్కువ మందితో సంబంధాలు కలిగి ఉండే డాక్టర్లు, టీచర్లు ఎలాంటి భయం లేకుండా ఈ పరికరంతో మాట్లాడవచ్చు. కరోనా సోకిన వ్యక్తితో మాట్లాడినా.. సమస్య రాదు. మైక్ వాడటంతో స్పష్టంగా మాట్లాడే అవకాశం ఉంటుంది.
స్మార్ట్ నాన్ కాంటాక్ట్ థర్మామీటర్
గుండ్లపోచంపల్లి కండ్లకోయలోని సీఎంఆర్ సెట్లో ఈసీఈ విద్యార్థి మోయినుద్దీన్ కళాశాల ఆర్అండ్డీ హెడ్ డాక్టర్ మెరుగు సురేశ్ పర్యవేక్షణలో స్మార్ట్ నాన్ కాంటాక్ట్ థర్మామీటర్‌ను తయారు చేశారు. ఇది కరోనా సంక్షోభ సమయంలో ఎంతగానో ఉపయోగపడింది. ఈ థర్మామీటర్ ద్వారా ఒక వ్యక్తి శరీర ఉష్ణోగ్రతను మరో వ్యక్తి సహకారం లేకుండానే కనుక్కునే అవకాశం ఉంటుంది. ఈ పరికరాన్ని తయారు చేసి, మేడ్చల్ మండల పరిధిలోని 9 గ్రామాలకు అందజేశారు. గ్రామ పంచాయతీల్లో అమర్చి, గ్రామస్తులు ఎవరికైనా కరోనా సోకిందా అనేది.. ఉష్ణోగ్రత ద్వారా తెలుసుకునే అవకాశం కల్పించారు. నాన్ కాంటాక్ట్ థర్మామీటర్‌కు ఐఈఈఈ(ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్) విభాగం స్పెషల్ ఇంట్రెస్ట్ గ్రూప్ ఆన్ హ్యుమానిటేరియన్ టెక్నాలజీ(ఎస్ఐజీహెచ్టీ) కింద ఇచ్చే అవార్డు లభించింది.
3డీ ప్రింటింగ్‌తో వికలాంగులకు తోడ్పాటు
గుండ్లపోచంపల్లి కండ్లకోయలోని సీఎంఆర్ టెక్నికల్ క్యాంపస్‌కు చెందిన అధ్యాపకులు షణ్ముగ సుందరం అహ్మద్ అలీబేగ్, అజయ్ సహకారంతో 3డీ ప్రింటింగ్ టెక్నాలజీతో వికలాంగులకు ఉపయుక్తంగా ఉండే విధంగా బయోడిగ్రేడేబుల్ ప్రోస్తెటిక్ లిబ్స్తో కాళ్లు, చేతులు తయారు చేసి, విజయవంతంగా అమర్చారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన డీఎస్టీ(డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ) ఈ ఆవిష్కరణకు నిధులు అందజేసింది. త్రీడీ ప్రింటింగ్‌ను నమూనాల తయారీకే కాకుండా వికలాంగులకు ఉపయోగపడే ఉపకరణాలు కూడా తయారు చేయవచ్చని వారు నిరూపించారు. బయోడిగ్రేడేబుల్ (శరీరం కలిసిపోయే) సామగ్రిని ఉపయోగించడం, అతి తక్కువ బరువు ఉండటంతో వికలాంగులకు ఎంతగానో సౌకర్య వంతంగా ఉండి, తాము వికలాంగులమని భావనే లేకుండా బతికే అవకాశం ఉంటుందని షణ్ముగసుందరం తెలిపారు. ఈ పరిజ్ఞానాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఆవిష్కరణ కర్తలు పరిశోధన చేస్తున్నారు.