సికింద్రాబాద్/మారేడ్‌పల్లి, జూలై 17: మోండా మార్కెట్ టకారబస్తీలోని ముత్యాలమ్మ దేవాలయంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ ఆధ్వర్యంలో ఆదివారం బోనాలు వైభవంగా జరిగాయి. పద్మారావు గౌడ్ కుటుంబ సభ్యులు తొలి బోనాన్ని సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోనాల ఉత్సవాల్లో హోంమంత్రి మహమూద్ అలీతో పాటు ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, పలు కార్పొరేషన్ల చైర్మన్లు బాలమల్లు, శ్రీనివాస్‌రెడ్డి, గజ్జెల నగేష్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత సహా రాజకీయ, అధికార ప్రముఖులు పద్మారావు గౌడ్ ఏర్పాటు చేసిన విందుకు హాజరయ్యారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు కిశోర్ కుమార్, కిరణ్ కుమార్, రామేశ్వర్ గౌడ్, త్రినేత్ర గౌడ్లతో పాటు సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన నేతలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నాగేష్తో పాటు మాజీ చైర్మన్ ముప్పిడి గోపాల్ పాల్గొన్నారు.
బోయిన్‌పల్లిలో ఘనంగా బోనాలు
ఆషాఢమాసం బోనాల్లో భాగంగా బోయిన్పల్లి మార్కెట్లోని కనకదుర్గమ్మ ఆలయంలో ఎమ్మెల్యేలు సాయన్న, మైనంపల్లి హన్మంత్‌రావు, వివేకానందలు ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో నేతలు నివేదిత, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్, మాజీ డైరెక్టర్ దేవులపల్లి శ్రీనివాస్, మార్కెట్ సెలక్షన్ గ్రేడ్ సెక్రటరీ శ్రీనివాస్‌తో పాటు పలువురు అధికారులు, నేతలు పాల్గొన్నారు.
సికింద్రాబాద్ రెజిమెంటల్‌బజార్‌లో
మహంకాళి బోనాల ఉత్సవాలు వైభవంగా జరిగాయి. పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, కళాకారుల ఆట, పాటలతో సందడిగా సాగాయి. మోండా డివిజన్ రెజిమెంటల్‌బజార్‌లోని గండి మైసమ్మ, జూలేశ్వరి దేవి, నల్ల పోచమ్మ,తుల్కలమ్మ , సెకండ్‌బజార్‌లోని ముత్యాలమ్మ, పీనుగుల మల్లన్న, శివాజీనగర్‌లోని డొక్కలమ్మ, ఈదమ్మ మహంకాళి బైరవస్వామి, వైఎంసీఏ ప్రాంతంలోని రేణుకా ఎల్లమ్మ ఆలయాల్లో బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. అదేవిధంగా పలు ఆలయాల వద్ద గోపాలపురం, మార్కెట్ పోలీసులు గట్టి బందోబస్తును నిర్వహించారు.
ప్రముఖుల ప్రత్యేక పూజలు
బోనాల ఉత్సవాలను పురస్కరించుకొని పలు ఆలయాల్లో పలువురు ప్రముఖులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రెజిమెంటల్‌బజార్‌లోని గండి మైసమ్మ ఆలయంలో మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్య నారాయణ, తెలంగాణ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, టీఎస్ఎంఐడీసీ కార్పొరేషన్ చైర్మన్ మన్నె క్రిశాంక్, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు శ్రీగణేష్, మాజీ కార్పొరేటర్ ఆకుల రూప, ఎమ్మెల్యే జి. సాయన్న కూతురు నివేదిత పలువురు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. రెజిమెంటల్‌బజార్‌లోని శ్రీ జూలేశ్వరి అమ్మవారి ఆలయంలో స్థానిక కార్పొరేటర్ కొంతం దీపక పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.