ఇలవేల్పుగా, భక్తుల కొంగుబంగారంగా విశేష పూజలందుకుంటున్న సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతర ఆదివారం నుంచి రెండురోజులపాటు వైభవంగా జరగనుంది. జాతరకు ప్రభుత్వం సకల ఏర్పాట్లు చేయడంతో ఆలయ పరిసరాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. 6 క్యూలైన్లు ఏర్పాటు చేయగా.. బోనాలు సమర్పించే వారికి 2 క్యూలైన్లు కేటాయించారు. 3500 మంది పోలీసులను బందోబస్తు కేటాయించగా, శనివారం నగర సీపీ ఆనంద్ భద్రతా చర్యలను పరిశీలించారు. గ్రేటర్‌వ్యాప్తంగా 19 ప్రాంతాల నుంచి ఆర్టీసీ 150 ప్రత్యేక బస్సులు నడుపుతోంది.
సిటీబ్యురో, జూలై 16 (నమస్తే తెలంగాణ)/బేగంపేట్ : రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకంగా ఆదివారం నిర్వహించే సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి జాతరకు అమ్మవారి దేవాలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. దేవాదాయ శాఖ అధికారులతో పాటు వివిధ శాఖల సమన్వయంతో భక్తులకు కావలసిన అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి 17న బోనాలు, 18న రంగం నిర్వహించనున్నారు. అమ్మవారికి ఉదయం 4 గంటలకు ప్రభుత్వం తరఫున పట్టువస్ర్తాలు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సమర్పించనున్నారు.
అనంతరం మహంకాళమ్మ దర్శనానికి బోనాల సమర్పణతో పాటు సాధారణ భక్తులకు అనుమతిని ఇవ్వనున్నారు. ఆపై అమ్మవారికి సాక, ఫలహారపు బండ్లు, తొట్టెల ఊరేగింపు, రంగం, పోతరాజుల విన్యాసాలు, బలిగంప, గావు పట్టడం, అంబారీపై అమ్మవారి ఊరేగింపు.. ఇలా రెండు రోజల పాటు ప్రధాన ఘట్టాలు ఉంటాయి. వీటిని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి రానున్నారు. భక్తులకు అనుగుణంగా మొత్తం ఆరు క్యూలైన్లను ఏర్పాటు చేశారు. ఇందులో బోనాలు సమర్పణకు రెండు, సాధారణ భక్తులకు రెండు, ఒకటి వీఐపీ, మరొకటి డోనర్ పాస్ క్యూలైన్లుగా కేటాయించారు.
సాధారణ ప్రజలు ఎంజీ రోడ్డు రామ్‌గోపాల్‌పేట్ పాత పోలీస్‌స్టేషన్ కొత్త ఆర్చీ గేట్ నుంచి మహంకాళిపోలీస్స్టేషన్ ఎదురుగుండా ఆలయానికి వెళ్లాలి.బోనాలు తీసుకువచ్చే మహిళలు రాష్ట్రపతి రోడ్డు బాటా చౌరస్తా నుంచి ఆశీర్వాద్ హోటల్ ఎదురు గుండా ఆలయానికి రావాలి.
కార్వాన్లో బోనాల శతాబ్ది ఉత్సవాలు 24న దర్బార్ మైసమ్మ బోనాలు
తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే పండుగ ఆషాఢ మాస బోనాలు అని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. కార్వాన్‌లోని దర్బార్ మైసమ్మ ఆలయం వద్ద ఈ నెల 24న నిర్వహించే బోనాల ఉత్సవాల ఏర్పాట్లపై ఆయన శనివారం కార్వాన్ దర్బార్ మైసమ్మ ఆలయం వద్ద పలు శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోనాల నిర్వహణకు ప్రభుత్వం రూ. 15 కోట్లు మంజూరు చేసిందన్నారు. మరో రెండు రోజుల్లో ఈ నెల 24న నిర్వహించే బోనాల కోసం చెక్కులు పంపిణీ చేస్తామన్నారు. దర్బార్ మైసమ్మ ఆలయం వద్ద భక్తులకు క్యూలైన్లు ఏర్పాటు చేసి 2 లక్షల తాగునీటి ప్యాకెట్లు అందుబాటులో ఉంచుతామన్నారు. అనంతరం కార్వాన్ సబ్జీమండీలోని నల్ల పోచమ్మ, మహంకాళి అమ్మవార్ల ఉమ్మడి ఆలయాల బోనాల శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని గంగపుత్ర సంఘం ప్రతినిధుల ఆధ్వర్యంలో రూపొందించిన బ్రోచర్, సీడీని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎంఎస్ ప్రభాకర్ రావు, పశ్చిమ మండలం డీసీపీ జోయల్ డెవిస్, జోనల్ కమిషనర్ రవి కిరణ్, డీఎంహెచ్‌వో డాక్టర్ వెంకటి, జలమండలి ఈఎస్సీ క్రిష్ణ, జీఎం నాగేందర్, సీఈ రమణ, టీఆర్ఎస్ నాయకులు ఠాకూర్ జీవన్ సింగ్, బంగారి ప్రకాశ్, మిత్ర క్రిష్ణ, కావూరి వెంకటేశ్, శేఖర్ రెడ్డి, గుడిమల్కాపూర్ కార్పొరేటర్ దేవర కరుణాకర్, దర్బార్ మైసమ్మ ఆలయ చైర్మన్ అమర్ సింగ్, సబ్జీమండి ఉమ్మడి ఆలయాల ప్రతినిధులు నిరంజన్ బాబు, అశోక్ కుమార్, కట్టా నర్సింగ్ రావు, శ్రీనివాస్, నంద కిశోర్, వేణు కుమార్ గౌడ్, శ్యాం సుందర్ తదితరులు పాల్గొన్నారు.
బందోబస్తుకు 3500మంది పోలీసులు
సికింద్రాబాద్ మహంకాళీ బోనాల పండుగకు హైదరాబాద్ పోలీసులు 3500 మందితో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. శనివారం పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్, శాంతి భద్రతల అదనపు పోలీసు కమిషనర్ డీఎస్ చౌహాన్ , నార్త్‌జోన్ డీసీపీ చందనాదీప్తి, ట్రాఫిక్ డీసీపీ ప్రకాశ్‌రెడ్డితో పాటు ఇతర ఉన్నతాధికారులు మహంకాళీ దేవాలయం వద్ద ఏర్పాట్లను సమీక్షించారు. బందోబస్తు, ట్రాఫిక్ మ్యాపింగ్‌లను పరిశీలించారు. సీపీ కెమెరాలు, ఇతర సాంకేతిక పరిజ్ఞానంతో నిరంతరం నిఘాను పోలీసులు అధికారులు నిర్వహిస్తున్నారు. మహిళల భద్రత కోసం షీ టీమ్స్ ప్రత్యేక పెట్రోలింగ్‌ను నిర్వహిస్తాయని అధికారులు వివరించారు. స్నాచర్స్, పిక్ పాకెటర్స్లపై ప్రత్యేక నజర్ పెట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ గంగారెడ్డి, మహంకాళి ఏసీపీ రమేశ్ తదితరులు ఉన్నారు.
మూడు వైద్య శిబిరాలు
వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పోలీస్‌స్టేషన్ ప్రాంగణం, అంజలి టాకీస్, సంతోష్ స్వీట్ హౌస్ వద్ద వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. జనరల్ బజార్, మహంకాళి ఠాణాల్లో అంబులెన్స్‌లు అందుబాటులో ఉంటాయి.
వాహనాల పార్కింగ్
రాష్ట్రపతి రోడ్డులోని ప్యాట్నీ సెంటర్ మహబూబ్ కాలేజ్, ఎస్డీ రోడ్డులోని బెల్సన్ తాజ్ హోటల్, జనరల్ బజార్ అంజలి టాకీస్, రాణిగంజ్‌లోని అడవయ్య చౌరస్తా, హరిహార కళాభవన్, ఓల్డ్జైల్ ఖాన, ఎంజీ రోడ్డులోని గాంధీ విగ్రహం వద్ద ఆరు ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్‌ను ఏర్పాటు చేశారు.
సాంస్కృతిక వేదికలు
ఆర్పీరోడ్డు మావురాల పెద్దమ్మ గుడి, జనరల్ బజార్ జ్యోతి ఫోటో స్టూడియో, పార్క్‌లైన్ తరుణి దుకాణం వద్ద, విక్టోరియా గంజ్ కూడలి, మంజు టాకీస్ సమీపంలో పాలిక బజార్, బాటా సంతోషి మిఠాయి దుకాణం వద్ద మొత్తం ఏడు సాంస్కృతిక వేదికలు ఏర్పాటు చేశారు.
150 ప్రత్యేక బస్సులు
సికింద్రాబాద్‌లో ఈ నెల 17, 18 తేదీలలో నిర్వహించే ఉజ్జయిని మహంకాళి బోనాలకు వచ్చే భక్తుల కోసం గ్రేటర్ జోన్ పరిధిలో 150 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు శనివారం ఆర్టీసీ గ్రేటర్ జోన్ అధికారులు ప్రకటించారు. గేటర్ పరిధిలో మొత్తం 19 ప్రాంతాల నుంచి భక్తులకు సిటీ బస్సులు అందుబాటులో ఉంటాయని, వీటి పర్యవేక్షణకు 11 మంది అధికారులు అందుబాటులో ఉంటారని చెప్పారు.
సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పిస్తున్న గోల్కొండ జగదాంబిక ఎల్లమ్మ ఆలయ ట్రస్టు చైర్మన్ వావిలాల మహేశ్వర్, సభ్యులు ఉమ, శ్రీకాంత్, వినోద్, ప్రభాకర్ రాజు, మోహన్‌దాస్ తదితరులు